మెగా సీరియల్ ను తలపిస్తున్న కర్నాటక అసెంబ్లీ  !!

కర్ణాటక రాజకీయ కల్లోలానికి ఇంకా అడ్డుకట్ట పడలేదు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఓటింగ్ పై హైడ్రామా ఇంకా కొనసాగుతోంది  

Last Updated : Jul 22, 2019, 10:42 PM IST
మెగా సీరియల్ ను తలపిస్తున్న కర్నాటక అసెంబ్లీ  !!

కర్నాటక అవిశ్వాస తీర్మానం మెగా సీరియల్‌ను తలపిస్తోంది. ఈ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. అంతిమంగా  వాయిదాతో సరిపోతుంది. ఫలితంగా  కుమారస్వామి సంకీర్ణ సర్కార్‌ భవితవ్యం విషయం ఇప్పట్లో తేలే అవకాశం కనబడటంలేదు. 

సభలో సీన్ రిపీట్

కర్నాటక అసెంబ్లీలో వాయిదాల సీన్ రిపీట్ అయింది. సోమవారం కూడా ఓటింగ్ జరగకుండానే సభ మళ్లీ వాయిదా పడింది. సభ ప్రారంభంకాగానే అవిశ్వాస తీర్మాసం ఓటింగ్ పై చర్చ సందర్భంలో స్పీకర్ సభలోని ముఖ్య సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ అంశంపై మాట్లాడేందుకు అధికార పక్షం నుంచి  సభ్యుల ఆ జాబితాను స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌  చదివి విన్పించారు. ఇదే సందర్భంలో సంఖ్యాబలాన్ని బట్టి ప్రతిపక్ష సభ్యుల్లో కొంత మందికి స్పీకర్ ఛాన్స్ ఇచ్చారు. అంతా మాట్లాడాకే ఓటింగ్‌కు అనుమతిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. 

అధికారపక్షం కాలయాపన వ్యూహం

విశ్వాస తీర్మానంపై చర్చ పేరిట కాలయాపన చేసే వ్యూహాత్మక ఎత్తుగడతో అధికార పక్షం ముందుకెళ్తున్నట్టు కనబడుతోంది. సభ 12 గంటలకు ప్రారంభమైనప్పటికీ సాయంత్రం 6 గంటల వరకు అధికార పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు మాత్రమే మాట్లాడారు. ఇందులో మంత్రి కృష్ణ భైరెగౌడ ఒక్కరే దాదాపు మూడు గంటలకు పైగా ప్రసంగించారు.  దీనికి తోడు మధ్యలో వాయిదాలతో సమయం గడిచిపోతుంది.

ఇంకా మాట్లాడాల్సింది ఎందరో..!!

అవిశ్వాస తీర్మానంపై ఇంకా మాట్లాడే వారు 16 నుంచి 20 మంది సభ్యుల వరకూ ఉన్నట్టు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఆ జాబితాను చదివి విన్పించారు. అందరూ కాకపోయినా ఆ జాబితాలో ముఖ్యులుగా ఉన్న సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం పరమేశ్వర  తప్పనిసరిగా మాట్లాడాల్సి ఉంది.

ఓటింగ్ కోసం బీజేపీ పట్టు !!

అధికార పార్టీకి సంబంధించిన వారు ఓటింగ్ జరగకుండా ఉండేందుకు కావాలనే కాలయాపన చేస్తున్నారని వాదించిన బీజేపీ సభ్యులు.. సభలో వెంటనే ఓటింగ్‌ నిర్వహించాలని సభలో పట్టుట్టారు. బలపరీక్ష నిర్వహిస్తామని స్పీకర్‌ ప్రకటించినప్పటికీ.. సభలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభో గందరగోళం..వాయిదా

ఓటింగ్ జరగకుండా కాలయాపన చేస్తున్నారంటూ ప్రతిపక్ష సభ్యుల సభకు అడ్డుచెప్పడంతో అధికార పక్ష సభ్యులు కూడా చర్చకు పట్టుబడుతూ సభలో బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కాగా ఇవాళ సభకు 205 మంది సభ్యులు హాజరుకాగా... బలపరీక్ష నిర్వహిస్తే విజయానికి 103 మంది మద్దతు అవసరం. రాజీనామా చేసిన 15 మందితో పాటు మరో నలుగురు సభ్యులు కూడా గైర్హాజరయ్యారు. 

 

Trending News