న్యూఢిల్లీ: దేశంలో 5 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రతీ ఏడాది రూ.6000 ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. కాగా నేడు ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6,000 లబ్ధి చేకూరనుంది. విడుదల చేసిన ప్రతీసారి రూ.2,000 చొప్పున మొత్తం మూడు విడతల్లో రైతులకు ఈ మొత్తం అందనుంది.
రైతులకు మేలు చేకూర్చనున్న ఈ పథకంలో అక్రమాలకు తావు లేకుండా వుండేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందిన రైతుల్లో కొంతమందికి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ధృవపత్రాలు అందనున్నాయని, ఇంకొంత మంది రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడతారని కేంద్రం తెలిపింది.