ట్రిపుల్ తలాక్ పై పార్లమెంటులో చర్చ: ముఖ్యంశాలు

ట్రిపుల్ తలాక్ పై పార్లమెంటులో చర్చ: ముఖ్యంశాలు

Last Updated : Dec 29, 2017, 07:02 PM IST
ట్రిపుల్ తలాక్ పై పార్లమెంటులో చర్చ: ముఖ్యంశాలు

ట్రిపుల్ తలాక్ పై పార్లమెంటులో జరిగిన వాడీవేడి చర్చలో భాగంగా కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ స్పందించారు.ఈ క్రమంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుపై ఆయన విరుచుకు పడ్డారు. ఆ బోర్డు ప్రామాణికత ఏమిటని, ముస్లిముల ప్రతినిధిగా ఈ బోర్డుని ఎవరు నియమించారని ఆయన తెలిపారు.

తాజాగా పార్లమెంటులో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లు తలాక్‌కి వ్యతిరేకం కాదని.. అయితే ఇన్‌స్టెంట్‌గా తీసుకొనే తలాక్‌కు మాత్రం వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికారులు, ముస్లిం మహిళల (హక్కుల పరిరక్షణ మరియు వివాహం) బిల్లు, 2017ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇది కేవలం రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లు మాత్రమే అని వారు తెలిపారు. 

ఈ రోజు ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభలో ప్రవేశబెట్టిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఇది పార్లమెంటు చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.  ఈ చట్టం అనేది ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మరియు వారికి న్యాయం చేకూర్చడానికి మాత్రం రూపొందించారని ఆయన తెలిపారు. అలాగే ట్రిపుల్ తలాక్ వల్ల బాధితులుగా మారిన మహిళల ప్రాథమిక హక్కులేమిటి అన్న విషయం కూడా పార్లమెంటు గుర్తించాలని.. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారు ముస్లిముల రాజ్యంగపరమైన ప్రాథమిక  హక్కులకు ఈ నూతన బిల్లు భంగం కలిగిస్తుందని తెలిపారని చెప్పారు.

ఈ కొత్త బిల్లు వల్ల ట్రిపుల్ తలాక్ బాధితులు మెజిస్ట్రేట్‌ కోర్టులో తమకు రావాల్సిన భరణం మరియు పిల్లల సంరక్షణకు సంబంధించి పిటీషన్లు వేయవచ్చని అన్నారు. కొత్త బిల్లు వల్ల ట్రిపుల్ తలాక్‌ను ఈమెయిల్, ఎస్సెమ్మెస్ లేదా వాట్సాప్ లాంటి ఏ ఇతర పద్ధతుల ద్వారా తీసుకున్నా చెల్లదని.. అలా తలాక్ తీసుకోవడం చట్టవ్యతిరేకమని తెలిపారు. ట్రిపుల్ తలాక్‌ చట్టం ప్రస్తుతం జమ్ము, కాశ్మీరుకి తప్పించి దేశంలోని అన్ని ప్రాంతాలకూ వర్తిస్తుందని.. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి 3 సంవత్సరాల జైలు మరియు జరిమానా తప్పనిసరి అని.. అలాగే నాన్ బెయిలబుల్ వారెంటు కూడా మంజూరు చేస్తారని తెలిపారు. 

ఆమెకు కూడా న్యాయం చేయండి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రిపుల్ తలాక్ బిల్లు పట్ల తన వ్యతిరేకతను తెలియజేస్తూ ఎంఐఎం నేత అసదుద్దీన్ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ బిల్లు ముస్లిముల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని తెలిపారు. న్యాయం చేయాలనుకొంటే దేశంలోని మతాలకతీతంగా అందరూ మహిళలకూ సమాన న్యాయం చేయండని.. ముఖ్యంగా నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్‌కి కూడా న్యాయం చేయండని ఆయన పేర్కొన్నారు. 

Trending News