ఎమర్జెన్సీ రోజులు మరచిపోలేని కాళరాత్రులు: ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Last Updated : Jun 26, 2018, 05:56 PM IST
ఎమర్జెన్సీ రోజులు మరచిపోలేని కాళరాత్రులు: ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ ప్రయోజనాలకై ప్రధాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ముంబైలో మంగళవారం జరిగిన 'డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ' కార్యక్రమంలో చెప్పారు. భారతదేశంలో చీకటి రోజులుగా వ్యవహరించే ఎమర్జెన్సీ(1975) విధించి 43 ఏళ్లయిన సందర్భంగా బీజేపీ ముంబయి విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని యావత్ యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్న మోదీ.. రాజ్యాంగం బీజేపీకి దైవంతో సమానమన్నారు.

అంతకు ముందు ముంబాయిలో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) మూడో వార్షిక సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్తలతో ముచ్చటించారు. భారతదేశం పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలమైన దేశమని మోదీ అన్నారు. వివిధ ప్రాజెక్టుల స్థాపనకు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారులు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఆర్థికాభివృద్ధి స్థిరత్వానికి భారతదేశం, ఏఐఐబీలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పిపిపి) విధానాన్ని అమలు చేస్తున్నామని మోదీ అన్నారు.

ఎమర్జెన్సీపై పాఠాలు: కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

ఎమర్జెన్సీ గురించి పాఠ్యగ్రంథాల్లో మరిన్ని అంశాలను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. 1975 లో ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీపై పాఠాలను రూపొందించడానికి తమ శాఖ కసరత్తు చేస్తోందన్నారు. ఎమర్జెన్సీపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.

 

 

Trending News