మరో వివాదంలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు

Last Updated : Jun 5, 2018, 05:23 PM IST
మరో వివాదంలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేసింది. రూ.2000 కోట్ల విలువైన బిట్ కాయిన్స్ కుంభకోణం కేసుని దర్యాప్తులో భాగంగా కుంద్రా నుంచి పలు సందేహాలకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ సమన్లు జారీచేసింది. బిట్ కాయిన్స్ కుంభకోణం కేసులో అమిత్ భరద్వాజ్ ని విచారించినప్పుడు రాజ్ కుంద్రా పేరు మొదటిసారి బయటికొచ్చింది. రోజూ రూ. 1 కోటి లేదా అంతకుమించిన మొత్తంలో బిట్ కాయిన్స్ తో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న వారికి ఇటీవలే ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీచేసింది. అవే వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగానికి సైతం పంపిస్తూ ఆర్థిక నేరాలు జరిగే ఆస్కారం ఉందనే కోణంలో ఆదాయ పన్ను శాఖ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ విచారణలో మున్ముందు మరింతమంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకొచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. 

రాజ్ కుంద్రాను ఏ కోణంలో ప్రశ్నించనున్నారు అనే వివరాల్లో ప్రస్తుతానికి స్పష్టత లేదు కానీ వివాదాల్లో కుంద్రా పేరు వినిపించడం మాత్రం ఇదేం మొదటిసారి కాదు. ప్రముఖుల పరువు మంటకలిపిన ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలోనూ కుంద్రాకు పాత్ర ఉందని నిరూపణ కావడంతో అతడిని క్రికెట్ క్రీడకు సంబంధించి పెట్టుబడుల్లో అనుమతించకూడదని తేల్చిచెప్పిన కోర్టు.. అప్పట్లో అతడు సహ యజమానిగా వున్న రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీని రెండేళ్లపాటు నిషేధించింది. అంతేకాకుండా క్రికెట్ సంబంధిత పెట్టుబడుల్లో కుంద్రాపై జీవిత కాలం నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ మార్చి నెలలోనే కుంద్రా సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Trending News