పాలకుల దేశభక్తికి, దూర దృష్టికి ఆయనే నిలువెత్తు నిదర్శనం: ఉపరాష్ట్రపతి

ప్రాచీన భారత జీవన విధానాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Vice president Venkaiah Naidu ). మైసూరు 25వ మహారాజు శ్రీ జయ చామరాజ వడయార్ శతజయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా ఉప రాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభా ప్రాంగణం నుంచి ఆన్‌లైన్ వేదిక ద్వారా ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jul 18, 2020, 08:24 PM IST
పాలకుల దేశభక్తికి, దూర దృష్టికి ఆయనే నిలువెత్తు నిదర్శనం: ఉపరాష్ట్రపతి

ప్రాచీన భారత జీవన విధానాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Vice president Venkaiah Naidu ). మన సంస్కృతి - సంప్రదాయాలు, వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని.. సమాజం, దేశంతో పాటు యావత్ ప్రపంచం శ్రేయస్సు కోసం భారత ప్రాచీన విధానమైన ‘తోటివారితో కలిసి పంచుకోవడం, అందరి పట్ల శ్రద్ధ చూపడం వంటి పద్ధతులను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. మైసూరు 25వ మహారాజు శ్రీ జయ చామరాజ వడయార్ శతజయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా ఉప రాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభా ప్రాంగణం నుంచి ఆన్‌లైన్ వేదిక ద్వారా ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజారంజక పాలన, ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తికి నిదర్శనం అయిన శ్రీ జయ చామరాజ వడయార్ ‘ప్రాచీన విలువలు, ఆధునిక ఆలోచనల కలబోత’ అని ప్రశంసించారు.  

‘భారత దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహారాజ శ్రీ జయ చామరాజ వడయార్ వంటి పాలకుల దేశభక్తి, దీర్ఘ దృష్టితో సమసమాజ స్థాపన లక్ష్యంతో వారు చేసిన ప్రజారంజక పాలన, కీలకమైన సందర్భాల్లో వారు వ్యవహరించిన తీరు మొదలైన వాటిని గుర్తు చేసుకుని, గౌరవించుకోవాల్సిన అవసరముంది అని అన్నారు. ఓ సమర్థవంతమైన పాలకుడిగా స్వాతంత్య్రానికి పూర్వ భారతదేశంలో ఓ బలమైన, ఆత్మనిర్భరత, సుస్థిరాభివృద్ధి కలిగిన మైసూరు రాజ్య నిర్మాణంలో మహారాజ శ్రీ జయ చామరాజ వడయార్ పాత్ర అత్యంత కీలకం’ అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల బాగోగులను తెలుసుకోవడంతోపాటు వారితో నిరంతరం అనుసంధానమై.. ప్రజా పాలకుడిగా రాజ్యవాసుల గుండెల్లో గౌరవాభిమానాలు సంపాదించుకున్నారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. మైసూరులో ఓ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండాలని నిర్ణయించి.. రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం, దీనికి శ్రీ కేసీ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించడం.. శ్రీ జయ చామరాజ వడయార్ గారి దూరదృష్టికి నిదర్శనమన్నారు. 

భారతదేశం బలమైన ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకుంటున్న సమయంలోనే మైసూరు మహారాజుగా దేశ ఐక్యమత్యం, సమగ్రతను కాపాడేందుకు వారు పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. స్వాతంత్య్రానంతరం సంస్థానాల విలీనం ప్రక్రియలో భాగంగా.. మనసా, వాచా, కర్మణా శ్రీ జయ చామరాజ వడయార్ గారు చొరవ తీసుకుని మొట్టమొదట భారతదేశంలో విలీనమైన రాజ్యంగా మైసూరును నిలిపారన్నారు. 
‘చాలా అంశాల్లో చాణక్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్న ఆదర్శాలను శ్రీ మహారాజా వారు ఆచరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర, సాంకేతికతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని గుర్తించి ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ చూపారు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆధునిక భారతంలో బెంగళూరులో హిందుస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్స్ లిమిటెడ్ (తర్వాతి కాలంలో హెచ్ఏఎల్‌గా మారింది), జాతీయ క్షయవ్యాధి సంస్థ, మైసూరులో కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ, అఖిల భారత వాక్, శ్రవణ సంస్థ (ఆలిండియా స్పీచ్, హియరింగ్ ఇనిస్టిట్యూట్) వంటి ఎన్నో సంస్థల ఏర్పాటుకు సంపూర్ణమైన మద్దతు అందించారన్నారు. 

బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అభివృద్ధికి, విద్యార్థులకు ప్రోత్సాహకాల విషయంలోనూ వారు ఆర్థికంగా సహాయం అందిస్తున్నారన్నారు. తత్వవేత్తగా, సమాజాభివృద్ధికి విస్తృతంగా దానధర్మాలు చేసిన పాలకుడిగా,  సంగీత పిపాసిగా, ఓ మేధావిగా బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉన్నప్పటికీ.. ఆయన నిత్యవిద్యార్థిగా ఉండేవారని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాలకు చేసిన విశిష్ట సేవకు గానూ ‘దక్షిణ భోజుడిగా’ పేరు సంపాదించుకున్నారన్నారు. మహారాజా వారికున్న సంస్కృతభాష పరిజ్ఞానం, అద్భుతమైన వాక్పటిమను ప్రశంసిస్తూ.. వారు రాసిన ‘శ్రీ జయ చామరాజ గ్రంథ రత్నమాల’ కన్నడ భాష, సాహిత్యంలో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు.
 భారతీయ విలువలు, సంప్రదాయాలు, సాంస్కృతిక  వారసత్వాన్ని అలవర్చుకుని తర్వాతి తరాలకు అందించడంతోపాటు.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.

Trending News