కండోమ్ కొనాలంటే.. ఆధార్ నెంబర్ చెప్పాలా..?

ఐఐటి ముంబయిలో జరిగిన వార్షిక మూడ్ ఇండిగో ఉత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం మరియు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.

Last Updated : Dec 23, 2017, 03:47 PM IST
కండోమ్ కొనాలంటే.. ఆధార్ నెంబర్ చెప్పాలా..?

ఐఐటి ముంబయిలో జరిగిన వార్షిక మూడ్ ఇండిగో ఉత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం మరియు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చలో నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజల ప్రైవసీని కాపాడేందుకు పార్లమెంటు చట్టాలు చేయాలని అభిప్రాయపడగా.. చిదంబరం లిబరల్ భావజాలం ఉన్న దేశంలో ప్రభుత్వం ప్రజలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మోదీ సర్కారు అన్ని  పథకాలకూ ఆధార్‌ను అనుసంధానం చేయమని చెప్పడంతో పాటు ప్రజలు చేసే ప్రతీ ట్రాన్సాక్షన్‌‌కి ఆధార్‌తో లింక్ ఉండాలని తెలపడంపై చిదంబరం స్పందించారు. ఇది ఒక రకంగా ప్రజల హక్కులను హరించడమేనని అభిప్రాయపడ్డారు. 

"పెళ్లి కాని ఓ అమ్మాయి, అబ్బాయి హాలిడేకి వెళ్లి ఎంజాయ్ చేయాలని భావిస్తారు. అటువంటి సందర్భంలో వారికి కండోమ్ అవసరం ఉండచ్చు.  అది వారి వ్యక్తిగత విషయం మరియు వారి ప్రైవసీకి సంబంధించిన విషయం. అలాంటి సమయంలో కండోమ్ కొనడానికి కార్డు ట్రాన్సక్షన్ జరిపేటప్పుడు... ఆధార్ సంఖ్య చెప్పాల్సిన అవసరమేముంది. ప్రభుత్వం మేల్కొనకపోతే రేపు ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి" అని చిదంబరం తెలిపారు. 

ప్రజలు సినిమాకి వెళ్లాలన్నా, మందులు కొనాలన్నా, స్నేహితులతో గడపాలన్నా.. అన్నింటికీ ఆధార్‌తో లింక్ ఎందుకు పెట్టాలి అన్న చిదంబరం ప్రశ్నించారు. అయితే చిదంబరం మాటలను నారాయణ మూర్తి ఖండించారు. చిదంబరం అడిగే ప్రశ్నలకు సమాధానాలు అన్నీ గూగుల్‌లో దొరుకుతాయని ఆయన జవాబిచ్చారు.

తాను బ్యాంకు ఖాతాకు ఆధార్ జత చేయలేదని.. ప్రజలు కూడా ఆధార్ పదే పదే అనుసంధానం చేయమని వచ్చే ఎస్సెమ్మెస్‌ల వల్ల విసిగిపోయి ఆధార్ జతచేస్తున్నారు కానీ.. మనస్ఫూర్తిగా కాదని చిదంబరం అన్నారు. రేపొద్దున మనిషి శవాన్ని తగలబెట్టాలన్నా ఆధార్ కార్డు జతచేయాలి అంటారని చిదంబరం అభిప్రాయపడ్డారు. దీనికి సమాధానమిస్తూ నారాయణమూర్తి మాట్లాడారు. ప్రభుత్వం ఆధార్ రూపకల్పన చేసి మంచిపనే చేసిందని.. అయితే ప్రజల ప్రైవసీని పరిరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Trending News