సంక్రాంతికి "ఆ నలుగురు" ప్రత్యేకం

సంక్రాంతి పర్వదినాన ప్రతీ ఊరికి వచ్చి తమ కళలను ప్రదర్శించి.. తృణమో.. పణమో సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు సంప్రదాయ కళాకారులు. 

Updated: Jan 17, 2018, 12:55 PM IST
సంక్రాంతికి "ఆ నలుగురు" ప్రత్యేకం

సంక్రాంతి పర్వదినాన ప్రతీ ఊరికి వచ్చి తమ కళలను ప్రదర్శించి.. తృణమో.. పణమో సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు సంప్రదాయ కళాకారులు. ఒక రకంగా చెప్పాలంటే పండగకు అసలైన కళ తెచ్చేది వీరే. కానీ నేడు... యువత ఆధునికతకు అలవాటు పడుతున్న క్రమంలో ఈ కళలకూ ఆదరణ తగ్గింది. అయినప్పటికీ 'ఆ నలుగురు' లేనిదే సంక్రాంతి లేదు. సంక్రాంతి అంటేనే జానపదం.. జానపదం అంటేనే సంక్రాంతి. సంక్రాంతి నాడు అందరూ ఎప్పటికీ గుర్తుపెట్టుకోదగ్గ ఆ జానపద కళాకారులెవరో మనమూ తెలుసుకుందాం..!

బుడబుక్కలవాడు - ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు’ అంటూ సంక్రాంతి నాడు తెల్లవారుఝామునే తన ఢమరుకంతో అందరినీ నిద్రలేపే బడుగుజీవి బుడబుక్కలవాడు. 'నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ పారెయ్యర సామి!’ అంటూ తనకు కావాల్సింది యాచిస్తూ..చలిపొద్దున ఢక్కీ మోగించే ఈ సంప్రదాయ కళాకారుడు నేడు వేగవంతమైన జీవితంలో కనుమరుగైపోయాడన్నది వాస్తవమే. దాదాపు ఓ పదేళ్ళ క్రిందటి మాటకొస్తే.. ఈ బుడబుక్కలజాతి వారు ప్రతీ ఊర్లోనూ కనిపించేవారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని డాంపురం దగ్గర ఒకప్పుడు మూడు వందల వరకూ ఈ బుడబుక్కల జాతికి కుటుంబాలు ఉండేవని వినికిడి. కానీ నేడు వీరి ప్రస్తావన దాదాపు కనిపించడం లేదు. ఈ బుడబుక్కలవారినే పగటివేషగాళ్లు అని కూడా కొన్ని చోట్ల అంటారు. 

హరిదాసు - సంక్రాంతి కొద్ది రోజుల్లో వస్తుందనగానే..హరినామ సంకీర్తన చేస్తూ..గ్రామాల్లో భిక్షాటన చేయడానికి బయలుదేరే వ్యక్తే హరిదాసు. ఇతని వేషధారణ కడు విచిత్రంగా ఉంటుంది. అందంగా కట్టుకున్న బంగారుజరీ పచ్చని పట్టు పంచెతో పాటు ఎర్రటి పట్టు వస్త్రాన్ని నడుము చుట్టూ కట్టుకొని రావడం ఇతని వస్త్ర సంప్రదాయం. అలాగే పట్టు తలపాగా తలకు చుట్టి.. తిరునామం పెట్టుకొని, మెడలో బంతిపూలమాల ధరించి, ఒక చేత్తో తంబుర మీటుతై.. మరో చేత్తో చిడతలు వాయిస్తూ హరిదాసు వస్తున్నాడంటేనే ఆయన వచ్చే వీధికి నిండుదనం వస్తుంది.

ఆయన తలపై ఉన్న రాగిపాత్రలోనే ఆడవాళ్ళు బియ్యాన్ని దక్షిణంగా వేస్తారు. హరిదాసులనే కొన్నిచోట్ల సాతాని జియ్యరులని, మాలదాసరులని అని కూడా అంటారు.  ''పలుకే బంగారా మాయెనా కోదండ రామా పలుకే బంగారా మాయెనా'' అని పాడుతూ ఆయన వీధిలోకి వచ్చి గాత్రాన్ని అందుకుంటే చాలు.. ఆయన చుట్టూ పిల్లలు మూగిపోతూ ఉంటారు.

కొమ్మదాసరి - సంక్రాంతి నాడు ఏదో ఒక ఊరి వీధికి వచ్చి, చెట్టుకొమ్మెక్కి యాచన చేసే సంప్రదాయ కళాకారుడే "కొమ్మదాసరి". ఇతను చెట్టు కొమ్మ పట్టుకొని, వూగుతూ చాలా  హాస్యాస్పదమైన రీతిలో ఊరిలోని ఆడవాళ్ళందరినీ పిలుస్తాడు. ఉదాహరణకు కొమ్మదాసరి వాడే పదప్రయోగం చాలా విచిత్రంగా ఉంటుంది. "నాగుల చీర తట్టిన నాగమ్మక్కో.. తెల్లచీర గట్టిన పల్లాలమ్మో.. చెంగావి చీర గట్టిన చుక్కమ్మక్కో..వంకాయ రంగు కోక కట్టిన వరదమ్మక్కో" అంటూ ఊర్లో వాళ్లందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆ తర్వాత తన గోడు వెళ్లబోసుకుంటాడు. 

"అక్కయ్యో పప్పుదాకలో పడి పోతున్నా.. పొయ్యిలో దూకేస్తున్నా.. అక్కో ఉరికేస్తున్నా... ముక్కు చితికింది అమ్మో, మూతి పగిలింది అప్పో, అక్కో కాలు బెణికింది, చెయ్యి విరిగింది, నడుం వంగింది. నాలుక ఎండింది..గొంతుక పూడింది..కళ్ళు తిరిగి పోతున్నాయి... దిగేస్తున్నా..అక్కల్లారా? అమ్మల్లారా?బిడ్డలు గల తల్లుల్లారా? బియ్యం పట్టుకు రండి. నాకు గుడ్డ లేయండి. చెట్టు దిగితే మీరేమిచ్చినా పుచ్చుకోను" అంటూ జనాలను నవ్విస్తూ..కవ్విస్తూ హంగామా చేసి మరీ భిక్షాటన చేయడం కొమ్మదాసరి సంప్రదాయం. వీరి సంప్రదాయం ప్రకారం చెట్టుమీద ఉన్నప్పుడే ఏదైనా పుచ్చుకుంటారట. చెట్టు దిగాక మాత్రం ఏదీ పుచ్చుకోరు. 

గంగిరెడ్లు - సంక్రాంతి వస్తుందంటే చాలు.. తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఆడించే జాతిని కొన్నిచోట్ల 'గంగిరెడ్లు' అని కూడా అంటారు. గంగిరెడ్లు ఎద్దులను  ఆడించడంలో చాలా ప్రత్యేకమైన పద్ధతులను అవలంబిస్తారు. గంగిరెద్దు వెంట వచ్చే వ్యక్తి వివిధ రంగులు కలగలిసిన షర్టు ధరించి.. దానికి తోడుగా చిత్రమైన తలపాగా.. పంచె ధరించి నుదుట నామంతో మెడలో వివిధ పూలదండలతో వేషం కడతాడు. తొలుత తనతో పాటు తీసుకెళ్లే ఎద్దుకి బాగా శిక్షణ ఇస్తాడు. తను ఏం చెబితే దానికి అది తలాడించేలా  ట్రైనింగ్ ఇప్పిస్తారు. తాను ఎద్దుతో మాట్లాడే పద్ధతి వినేవారికి నవ్వు తెప్పిస్తుంది. గంగిరెద్దులవాడు గృహస్థును, గృహిణిని పొగడ్తలతో మురిపించడం ఈ ఆటలో ప్రత్యేకత.