వైఎస్ జగన్ అధికారంలో వస్తే ఏపీలో ఫ్యాక్షనిజం పెరుగుతుందని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ జలీల్ ఖాన్ ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హమారా.. నారా హమారా కార్యక్రమంలో తుని ఘటన తరహాలో వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని జలీల్ ఖాన్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20-30కి మించి సీట్లు రావని, జనసేనకు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీకి వైసీపీ దగ్గరవుతుందన్న ఆయన.. వైఎస్ జగన్ అధికారంలో వస్తే ఫ్యాక్షనిజం పెరుగుతుందని అన్నారు. జగన్ చేసేది సంకల్పయాత్ర కాదని, పిక్నిక్ యాత్ర అని ఎద్దేవాచేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. రాయలసీమ యువకులతో గుంటూరు మైనార్టీ సభను భగ్నం చేయాలని జగన్ యత్నించారని ఆరోపించారు. ప్రధాని మోదీ, జగన్ మధ్య స్నేహం పెరిగిందన్న ఆయన.. వైసీపీ నాయకులే సభకు పంపారని అల్లరి చేసిన యువకులు పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నారని కేఈ తెలిపారు. జగన్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని మరో మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ అన్నారు. తండ్రి బాటలోనే జగన్ నడుస్తూ.. మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. సభలో సీఎంపై దాడికి ప్రయత్నం జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు.
జగన్ వస్తే ఫ్యాక్షనిజమే: జలీల్ ఖాన్