కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు లోక్సభ నియోజకవర్గాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు గత శనివారం ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కౌంటింగ్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ముందంజ వేయగా.. ఒక స్థానంలో బీజేపీ దూసుకెళ్తోంది. ముఖ్యంగా.. మండ్య, బళ్లారి లోక్సభ స్థానాలు, రామనగర, జమఖండీ శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ముందంజలో ఉండడం గమనార్హం. అలాగే రామనగర ప్రాంతంలో సీఎం కుమారస్వామి సతీమణి అనిత కూడా ముందంజలో ఉన్నారు.
అయితే శివమొగ్గలో పరిస్థితి వేరే విధంగా ఉంది. అక్కడ బీజేపీ పుంజుకుంటోంది. యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ఇక్కడ బీజేపీ అభ్యర్థి కాగా.. ఆయన ప్రస్తుతం రేసులో ముందున్నారు. జేడీఎస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప తనయుడు మధు బంగారప్ప కూడా ఇదే స్థానం నుండి బరిలో దిగారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పోటీ సాగుతోంది.
శివమొగ్గ ఎంపీగా ఉన్న యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశాక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన విషయం తెలిసింది. కావున ఆ స్థానంలో కూడా ఉప ఎన్నిక ఆవశ్యకం అయ్యింది. ప్రస్తుతం కర్ణాటకలో ఉప ఎన్నిక పోరు జాతీయ స్థాయిలో మళ్లీ ఆసక్తిని కలిగిస్తోంది. బీజేపీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉందని.. ఈసారి కూడా ఏదో మ్యాజిక్ జరగబోతుందనే వాదన చాలామంది కన్నడ ప్రజల్లో కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం శివమొగ్గ, బళ్లారి, మాండ్య లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా... రామనగరం, జమ్ఖండి అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది.