యాదాద్రి భువనగిరి: జిల్లాలోని నారాయణపురం మండలం అరేగుడెంలో మంగళవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. భూమి పంచాయితీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాశయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల వేధింపులు భరించలేకే కాశయ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భూమి పంచాయితీ విషయమై గత కొద్ది రోజులుగా నారాయణపురం ఎస్సై నాగరాజు, ఏఎస్సై శ్యామ్ సుందర్ తమను వేధిస్తున్నారని కాశయ్య కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం ఉదయం కూడా ఏఎస్సై శ్యామ్ సుందర్ మరో నలుగురు కానిస్టేబుళ్లను వెంట తీసుకొచ్చి బెదిరింపులకు దిగారని.. దీంతో వారి వేధింపులు తాళలేకే కాశయ్య ఆత్మహత్యాయత్నం చేశాడని బాధితుడి కుటుంసభ్యులు ఆరోపించారు.
పురుగుల మందు తాగిన కాశయ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆయన్ను హైదరాబాద్ హయత్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కాశయ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. రైతు ఆత్మహత్యాయత్నం ఘటనలో నారాయణపురం ఎస్సై, ఏఎస్సైల ప్రమేయంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. భూతగాదాల్లో పోలీసులు తలదూర్చకూడదని కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ... పోలీసులు తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి.
పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన రైతు !