భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ నాలుగోరోజైన ఆదివారం కూడా ఆట ప్రారంభమైంది. టీమిండియా పెట్టిన టార్గెట్ ను శ్రీలంక టీం దాటేసి దూసుకెళ్తోంది.
వివరాలలోకి వెళితే.. గురువారం కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ వర్షం కారణంగా ఆలస్యంగా భారత్- శ్రీలంక తొలిటెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆట మొదలైనప్పటి నుంచి వెలుతురు లేమి, మబ్బులు కమ్ముకోవడం, ఆగి ఆగి కురుస్తున్న వర్షం కారణంగా... తొలిటెస్ట్ మ్యాచ్ లో ఇండియా శనివారం తన ఇన్నింగ్స్ ముగించేసరికి 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
శనివారం కొద్దిసేపటికి తరువాత బ్యాటింగ్ బరిలో దిగిన శ్రీలంక సాయంత్రం ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆదివారం ఉదయం ఆట ప్రారంభించిన శ్రీలంక, గంటలోనే టపటపా మంటూ మూడు వికెట్లు కోల్పోయింది. 53వ ఓవర్లో డిక్వెల్లా(35 పరుగులు) , 54వ ఓవర్లో షనాక(0 పరుగులు), 55వ ఓవర్లో చండీమల్(28 పరుగులు) అవుటయ్యారు. భువనేశ్వర్ షనాక వికెట్ ను, మహమ్మద్ షమీ మిగితా రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం క్రీజులో పెరారీ, హెరాత్ లు ఆడుతున్నారు. కడపటి వార్తలందేసరికి లంక స్కోర్ 64.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేశారు.