ఆదివారం విశాఖపట్నం వేదికగా భారత్- శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో 1-1 తో ఇరు జట్లు సమాన స్థితిలో ఉన్నాయి. అయితే ఇరు జట్ల పరిస్థితులు పూర్తిగా భిన్నం. తొలి వన్డేలో టీమిండియాపై బంపర్ విక్టరీ సాధించి రెండో వన్డేలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన లంకేయులకు ఊహించని ఘోర పరాజయం లభించింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడి సిరీస్ ఉంటుందా.. పోతుందా.. అన్న సందేహాల మధ్య మొహాలిలో జరిగిన రెండో వన్డేలో 392 పరుగుల భారీ స్కోరుతో. ..లంకపై ఊహించని రీతిలో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొత్తానికి లెక్కలు ఇలా సమానమయ్యాయి.
ఇప్పుడిక నిర్ణయాత్మక పోరు. కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకున్న రోహిత్.. తొలి సిరీస్ విజయాన్ని కూడా సాధిస్తాడా ? అతడి నేతృత్వంలోని జట్టు విశాఖలో భారత్‌కున్న ఘనమైన రికార్డును కొనసాగిస్తుందా ?. భారత్, శ్రీలంక వన్డే సిరీస్‌లో పతాక సన్నివేశం.. సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక సమరం ఎలాంటి ఆసక్తిని రేకెతిస్తోంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ రోజు జరిగే ఫైనల్ గాని ఫైనల్ మ్యాచ్‌లో.. తొలి వన్డేలో పర్యాటక జట్టు, రెండో వన్డేలో ఆతిథ్య జట్టు విజయాలతో సమమైన సిరీస్‌లో అంతిమ విజేత ఎవరో తేలనుంది.
ఆదివారమే విశాఖపట్నంలో మూడో వన్డే జరగనుంది. రెండో వన్డేలో భారీ విజయంతో జోరుమీదున్న టీమ్ఇండియా మళ్లీ ఫేవరెట్ స్థానంలోకి రాగా.. ధర్మశాల తరహాలో భారత్‌కు మరోసారి షాకివ్వాలని లంక పట్టుదలతో ఉంది. దీంతో మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. కాగా ఈ రోజు మధ్యాహ్నం 1.20 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.