ముంబై: మహారాష్ట్రలో నేడు దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. సోమవారం చారిత్రాత్మక 'భీం-కరేగావ్' యుద్ధ ద్విశతాబ్ది ఉత్సవాలలో భాగంగా పూణే నగరంలో కుల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణల్లో ఒక దళితుడు చనిపోయాడు. దాంతో కోపోద్రిక్తులైన దళితులు ముంబైతో సహా మహారాష్ట్ర వ్యాప్తంగా రైళ్లు, రోడ్లను నిర్బంధించారు. మంగళవారం కూడా దళితులు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి బస్సు అద్దాలను పగులగొట్టారు. టైర్లకు నిప్పంటించారు. రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. సమ్మె మరింతగా హెచ్చుమీరడంతో అదనపు బలగాలను రంగంలోకి దింపింది ప్రభుత్వం.
నేడు రాష్ట్ర బంద్
ద్విశతాబ్ది ఉత్సవాల్లో చెలరేగిన హింసకు నిరసనగా.. పలు దళితసంఘాలు నేడు మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందుకు ప్రజాసంఘాలు, సిపిఎం పార్టీ మద్దతు పలికాయి. దళితులు నిర్వహిస్తున్న ర్యాలీపై కావాలనే ప్రభుత్వం దాడి చేసిందని ఆరోపించాయి. హిందుత్వ శక్తుల్లో దళితుడి హత్యను తీవ్రంగా ఖండించాయి. కాగా..మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం చోటుచేసుకున్న ఘర్షణలపై సిట్టింగ్ జడ్జీచేత న్యాయ విచారణకు ఆదేశించారు.