టాలీవుడ్లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారనే టాక్ ఇవాళ కొత్తది కాదు. కాకపోతే అందులో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లనుంది అనే వివరాలపైనే ఎప్పటికప్పుడు సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. అయితే, తాజాగా మిడ్-డే ప్రచురించిన ఓ కథనం ప్రకారం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ విషయంలో హిందీ నిర్మాతలకు ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రీమేక్ వెర్షన్లో రణ్వీర్ సింగ్ కానీ లేదా షాహీద్ కపూర్ కానీ నటించే అవకాశాలున్నట్టుగా గతంలో వార్తలు వెలువడ్డాయి. అర్జున్ రెడ్డి రిలీజైన కొత్తలోనే ఆ సినిమాను ప్రత్యేకంగా ప్రీమియర్ షోలో వీక్షించిన రణ్వీర్ సింగ్ ఈ రీమేక్‌లో నటించడం దాదాపు ఖాయమైనట్టేననే ప్రచారం కూడా జరిగింది.
అయితే, లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ ఈ రీమేక్‌లో నటిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం షూజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్న అక్టోబర్ సినిమాలో నటిస్తున్న వరుణ్ ధావన్ ఆ తర్వాత యాశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణ సంస్థతో 'సూయి ధాగ' అనే సినిమా చేయాల్సి వుంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత జూన్ లేదా జులై మధ్య అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ పట్టాలెక్కే అవకాశం వుంది. ఈ హిందీ రీమేక్ వెర్షన్‌ని ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయనున్నట్టు మిడ్-డే కథనం స్పష్టంచేస్తోంది.