ప్రఖ్యాత కవి, రాజకీయ నేత, స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు.
"కవయిత్రి, రాజకీయ నాయకురాలు, మహిళల ఉద్యమ మార్గదర్శకురాలు అయిన సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా నివాళులు' అని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Tributes to Sarojini Naidu — poet, political leader and pioneer of our women’s movement, on her birth anniversary #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) February 13, 2018
సరోజినీ నాయుడు 'భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)' గా పిలవబడ్డారు. 1879 ఫిబ్రవరి 13న జన్మించిన సరోజినీ, 12 ఏళ్ల వయస్సు నుండి రచనా వ్యాసంగం పట్ల మొగ్గుచూపారు.
ఆమె రచించిన కావ్యాలలో "బర్డ్ ఆఫ్ టైం", "ది గోల్డెన్ త్రెషోల్డ్", "ది బ్రోకెన్ వింగ్స్" అనేవి చాలా ప్రసిద్ధమైనవి. ఆమె ఇంగ్లాండులో నివసిస్తూ రచనలు సాగించినా వాటిలో భారతీయ జీవితాలు ప్రతిబింబించేటట్లు చేయడం, మన జాతి ప్రత్యేకతలను అందులో చొప్పించి కథా విధానం నడిపించడం విశేషం. సరోజినీ నాయుడు 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన సమయంలో భారత జాతీయ ఉద్యమంలో చేరారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహిళల్లో సరోజినీ ఒకరు.
1925 లో కాన్పూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి తొలి మహిళగా అధ్యక్షత వహించి, 1929లో దక్షిణాఫ్రికాలో తూర్పు ఆఫ్రికా ఇండియన్ కాంగ్రెస్‌కు హాజరయ్యారు. సరోజినీ 1930లో మహాత్మా గాంధీ, మదన్ మోహన్ మాలవ్యాలతో కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
సరోజినీ నాయుడు ఆ తరువాత యునైటెడ్ ప్రావిన్స్ (ప్రస్తుత ఉత్తరప్రదేశ్) గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆమె మార్చి 2, 1949లో లక్నోలోని ప్రభుత్వ గృహంలో మరణించారు.