2022 Summer Release Telugu Film List: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏదీ సజావుగా సాగడం లేదు. అన్ని రంగాల మాదిరిగానే సినీ రంగంపై కూడా కరోనా భారీగా ప్రభావం చూపింది. మహమ్మారి వలన కొన్ని సినిమాలు షూటింగ్స్ జరుపుకోలేకపొతే.. మరికొన్ని సినిమాలు షూటింగ్స్ పూర్తిచేసుకున్నా విడుదలకు నోచుకోలేదు. ముఖ్యంగా థర్డ్ వేవ్ ప్రభావం టాలీవుడ్‌పై బాగానే పడింది. చాలా సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్దమవగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విడుదలను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు మహమ్మారి అదుపులోకి రావడంతో వరుసగా సినిమాలు రిలీజ్ అయేందుకు సిద్ధంగా ఉన్నాయి.
సమ్మర్ స్టార్ట్ కాకముందే టాలీవుడ్లో సినిమా జాతర మొదలవనుంది. ఇక మార్చి మొదటి నుంచి మే వరకు వరుసగా సినిమాలు విడుదల అవనున్నాయి. ఇందులో చిన్న, పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ వేసవి మొత్తం టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద పండగ అనే చెప్ప్పాలి. కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టి ఎలాంటి ఇబ్బందులు లేకపోతే.. ఈ వేసవిలో టాలీవుడ్ రూ. 2000 నుంచి 3000 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో విడుదల అవనున్న సినిమాల జాబితాను ఓసారి చూద్దాం.
బీమ్లా నాయక్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'బీమ్లా నాయక్' చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కోసం వెనక్కి తగ్గింది. ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించగా.. తాజాగా ఈ నెల 25నే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. పవన్, రానా కలిసి నటించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
గని:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం 'గని'. మహాశివ రాత్రి కానుకగా ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. బాబాయ్ అబ్బాయి కలిసి ఒకేరోజు సందడి చేయనున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మించారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో నటించారు.
రాధే శ్యామ్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీ సంక్రాంతి రేసులో నిలిచినా.. కరోనా కారణంగా వెనక్కి తగ్గింది. ఇక రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.
ఆర్ఆర్ఆర్:
కరోనా కారణంగా వరుసగా వాయిదా పడుతున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. గతేడాదే విడుదల అవ్వాల్సిన ఈ సినిమాను సంక్రాంతికి ముందు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఒమిక్రాన్ కారణంగా విడుదలకు నోచుకోని ఈ సినిమా మార్చి 25న విడుదల అవనుంది. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. స్టార్లు అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దాదాపు రూ.600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
కేజీఎఫ్ 2:
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్' 2 సినిమా కూడా సమ్మర్ కానుకగా బరిలో ఉంది. కరోనాతో పాటు ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఆచార్య:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన సినిమా 'ఆచార్య' ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఏప్రిల్ 1కి వాయిదా పడింది. ఆ డేట్‌కు కూడా కాకుండా ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతకాలు ఆచార్య సినిమాను రూపొందించాయి.
సర్కారు వారి పాట:
పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా 'సర్కారు వారి పాట' మే 12న విడుదల అవనుంది. జనవరి 13న సంక్రాంతి బరిలో నిలవాలని భావించినా.. షూటింగ్ కారణంగా ఏప్రిల్ ఒకటిన రిలీజ్ చేస్తామంటూ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే మహేశ్ బాబుకు కరోనా సోకడంతో షూటింగ్ ఆగిపోవడంతో చివరకు మేలో విడుదలకు సిద్ధమైంది. సూపర్ స్టార్ సరసన కీర్తి సురేష్ నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఎఫ్ 3:
వెంకటేష్‌తో కలిసి వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఎఫ్ 3' మే 27న విడుదల కానుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ సరసన తమన్నా, మెహరీన్ మరోసారి జతకట్టారు. సునీల్, సోనాల్ చౌహన్ కూడా ఎఫ్ 3లో నటిస్తున్నారు. విశ్వక్ సేన్ నటిస్తున్న 'అశోకవనంలో అర్జున కల్యాణం' మార్చి 4వ తేదీన విడుదల కానుంది. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. వీటితో పాటు పలు చిన్న సినిమాలుకూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read: Illicit Affair: మామతో కోడలి వివాహేతర సంబంధం.. కూతురికి తెలియడంతో ఎంతకి తెగించారంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook