ఉత్తరప్రదేశ్: ఉన్నావ్ రేప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సిట్‌కు అప్పగించిన నివేదిక ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బాధితురాలికి.. ఆమె తండ్రికి జ్యుడీషియల్ కస్టడీకి ముందు తగిన మెడికల్ కేర్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేయగా.. మరో ముగ్గురు డాక్టర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అన్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు నిరాకరించారు. కేసుకు సంబంధించి ఎస్పీ కార్యాలయానికి ఎమ్మెల్యే వచ్చిన సమయంలో ఆయన అనుచరులకు, మీడియా ప్రతినిధులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన సెంగార్.. కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
The case has been transferred to CBI: Principal Secretary (Home) Arvind Kumar #UnnaoCase pic.twitter.com/6pWfRmmmVW
— ANI UP (@ANINewsUP) April 12, 2018
ఈ కేసులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. కాగా, తనపై బీజేపీ ఎంఎల్ఏ కుల్దీప్ సింగ్ సెంగార్, ఆయన సోదరుడు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి యూపీ సీఎం నివాసం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోగా కస్టడీలోనే ఆయన మరణించడం కలకలం రేపింది. బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల బాధితురాలి కుటుంబీకులు సంతృప్తి వ్యక్తం చేశారు.