మొత్తానికి కోల్‌కతా చెలరేగి ఆడింది.. ఐపీఎల్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తి అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో ఐపీఎల్ టీ20ల్లో 200 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్లలో రాణా, రసెల్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ ముందు ఉంచగా.. ఏ మాత్రం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఆ జట్టు 71 పరుగుల తేడాతో ఓడిపోయింది .
స్పిన్నర్లు నరైన్ 3, కుల్దీప్ 2 వికెట్లతో తమదైన శైలిలో రాణించడంతో ఢిల్లీ జట్టు 14.2 ఓవర్లకు 129 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ ఆటగాళ్లలో రిషబ్ పంత్ (43; 26 బంతుల్లో 7×4, 1×6), మ్యాక్స్‌వెల్ (47; 22 బంతుల్లో 3×4, 4×6) కొంతవరకు నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా.. వికెట్లు పడిపోవడంతో ఓటమి తప్పలేదు.
తొలుత కోల్‌కతా జట్టు కూడా కష్టాలతోనే మ్యాచ్ ప్రారంభించింది. 7 పరుగులకే ఓపెనర్ నరైన్ (1) వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత 62 పరుగుల వద్ద ఉతప్ప వికెట్ పడిపోయింది. ఆ తర్వాత క్రిస్ లిన్, దినేశ్ కార్తిక్ కూడా పెవిలియన్‌కి వెళ్లిపోవడంతో కోల్‌కతా కథేమిటో అర్థం కాలేదు.
ఆ సమయంలో యువ ఆటగాడు నితీశ్ రాణా (59; 35 బంతుల్లో 5×4, 4×6), ఆండ్రూ రసెల్ (41; 12 బంతుల్లో 6×6) వచ్చి మ్యాచ్ స్వరూపం మార్చేశారు. వీరిద్దరూ ఔట్ అయ్యేసరికల్లా కోల్‌కతా 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రం పూర్తిచేసేసి ప్రత్యర్థికి చెప్పుకోదగ్గ టార్గట్ ఇచ్చింది.