Revanth Reddy: మొన్న టీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదేలు.. నిన్న గ్రేటర్ కార్పొరేటర్ విజయారెడ్డి.. నేడు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. గాంధీభవన్ కు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ దూకుడు పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ ఎంసీ ఫలితాల తర్వాత ఆ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన కరీంనగర్ హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం బీజేపీకి మరింత బూస్ట్ ఇచ్చింది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలు పోటిపడి మరీ కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇందులో ఉన్నారు. అధికార పార్టీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు చూడకుండా కాషాయం వైపు మొగ్గు చూపారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయామని భావించిన నేతలు.. పోటాపోటీగా ఆ పార్టీలోకి చేరిపోయారనే టాక్ వచ్చింది.
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగిన రాజకీయాల్లో కొన్ని రోజులుగా సీన్ మారిపోయింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ బలం పుంజుకుంది. రేవంత్ రెడ్డి వరుసగా చేపట్టిన కార్యక్రమాలతో హస్తం పార్టీ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా బీజేపీలోకి వలసలు నిలిచిపోయాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో చేరికలు పెరిగిపోయాయి. టీఆర్ఎస్ లో సుదీర్ఘ కాలం పనిచేసిన.. చెన్నూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లాల ఓదేలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓదేలు బీజేపీలో చేరనున్నారని గత ఆరు నెలలుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ పెద్దలు ఆయనతో మాట్లాడారనే వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఓదేలు. ఈ ఘటన బీజేపీని షాకింగ్ కు గురి చేసిందని తెలిసింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న బండ్రు శోభారాణి కాషాయ పార్టీకి షాకిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమెరికాలోనే రేవంత్ రెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పేశారు. బీజేపీలో తనకు గుర్తింపు లేదనే పార్టీ మారినట్లు శోభారాణి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా హస్తం పార్టీలో చేరిపోయారు. గ్రేటర్ మేయర్ పీఠం ఆశించిన విజయారెడ్డి.. కొంత కాలంగా పార్టీ మారాలని చూస్తున్నారు. విజయారెడ్డిని గ్రేటర్ బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. అయితే విజయారెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నేతలు ఆహ్వానించినా అటు వెళ్లకుండా.. రేవంత్ రెడ్డి గూటికి చేరడం చర్చగా మారింది. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. పినపాక నియోజకవర్గానికి చెందిన కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు కూడా అధికార పార్టీకి హ్యాండిచ్చి.. రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం రేసులో కాంగ్రెస్ కంటే బీజేపీ వెనకబడిందనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న రేవంత్ రెడ్డి.. తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను గుర్తించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో.. కొందరు నేతలకు టికెట్లపైనా ఆయన హామీ ఇస్తున్నారని అంటున్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి అలానే కాంగ్రెస్ లో చేరారని అంటున్నారు. విజయారెడ్డికి కూడా టికెట్ హామీ ఇచ్చారని సమాచారం. అటు బీజేపీలో మాత్రం మరో సీన్ కనిపిస్తోంది. ఆ పార్టీలో వలస నేతలకు గుర్తింపు లేదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరిన శోభారాణి కూడా ఆవే ఆరోపణలు చేశారు. దీంతో తమకు టికెట్ వస్తుందో రాదో క్లారిటీ లేని బీజేపీలోకి చేరడం కంటే కాంగ్రెస్ లో చేరితేనే బెటరనే యోచనలో నేతలు ఉన్నారంటున్నారు. అందుకే అధికార పార్టీలోని అసమ్మతి నేతలు బీజేపీ కాకుండా కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కమాల్ తో త్వరలోనే మరికొందరు టీఆర్ఎస్ సీనియర్ నేతలు.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం గాంధీభవన్ లో సాగుతోంది. జూలై 1,2 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఆ సమావేశాల కంటే ముందే బీజేపీకి షాకిచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. చూడాలీ మరీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలా మారుతాయో..
Read also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వేగంగా నైరుతి గాలులు..ఇవాళ్టి వెదర్ రిపోర్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.