అలహాబాద్ బ్యాంకు ఎండీ, సీఈఓ ఉషా అనంత సుబ్రహ్మణ్యంపై సీబీఐ ఛార్జిషీటు ఫైల్ చేసింది. ఉషా అనంత సుబ్రహ్మణ్యం అలహాబాద్ బ్యాంకులో బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంకుకి సీఈఓగా వ్యవహరించారు. అయితే నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును నట్టేటా ముంచి రూ.13,000 కోట్లకు ఎగనామం పెట్టాక... ఆ బ్యాంకుకు చెందిన పెద్ద పెద్ద డైరెక్టర్ల అందరిపై కూడా సీబీఐ నిఘా పెట్టింది.
ఆ దర్యాప్తులో భాగంగానే పీఎన్బీ మాజీ ఎండీ, సీఈఓ ఉషా అనంత సుబ్రహ్మణ్యంపై కూడా ఛార్జీషీటు ఫైల్ చేసింది. ఆమె పీఎన్బీలో 2015 నుండి 2017 వరకు బాధ్యతలు నిర్వహించారు. అలాగే సీబీఐ ఇదే బ్యాంకులో కీలక పదవులు నిర్వర్తించిన కేవీ బ్రహ్మాజీరావు, సంజీవ్ శరన్లపై కూడా ఎంక్వయరీ వేసింది. నీరవ్ మోదీ కేసు దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనమైందో మనకు తెలిసిన విషయమే.
ప్రస్తుతం నీరవ్ మోదీ హాంగ్ కాంగ్లో నివసిస్తున్నారు. ఆయనను భారత్ తీసుకొని వచ్చేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సన్నాహాలు జరుపుతోంది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్, హాంగ్ కాంగ్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా మాట్లాడారు.