Hyderabad Liberation day: సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ చరిత్రతో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. 1948, సెప్టెంబర్ 17న అప్పటి తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయిన రోజు. భారదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ స్టేట్ మాత్రం రాజరిక పాలనలోనే ఉంది. 1948లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలోతో తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయింది. అంటే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17న వచ్చిందన్న మాట. అయితే సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణలో వివాదాలు అలుముకున్నాయి. సెప్టెంబర్ 17 రాజకీయ చక్రబంధంలో చిక్కుకుంది. 75 ఏళ్లు గడిచినా ఈ వివాదం మాత్రం చల్లారడం లేదు. ప్రతి ఏటా సెప్టెంబర్ న రచ్చే. సెప్టెంబర్ 17ను ఒక్కో పార్టీ ఒక్కోలా వేడుకలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా జరుపుతోంది. కేంద్రానికి కౌంటర్ గా తెలంగాణ సర్కార్ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్సవం జరుపుతుండగా.. వామపక్షాలు మాత్రం విద్రోహ దినంగా పాటిస్తున్నాయి. దీంతో అసలు సెప్టెంబర్ 17న ఏం జరిగింది.. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక తెలంగాణ ప్రజలకు సైనిక చర్యతో విమోచనం లభించిందా? లేక వామపక్షాలు చెబుతున్నట్లు విద్రోహం జరిగిందా? .. ఇవన్ని ప్రశ్నలే. నిజాం రాజు పాలన ఎలా ముగిసింది.. తెలంగాణ సాయుధ పోరాటం లక్ష్యమేంటీ..హైదరాబాద్‌పై పోలీస్ యాక్షన్ ఎలా జరిగింది... తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలవడంలో నెహ్రు- పటేల్ పాత్ర ఎంత.. అసలు సెప్టెంబర్-17న ఏంజరిగింది?
సెప్టెంబర్ 17పై భిన్న వాదనలున్నాయి. ఎవరికి వారు తమ వాదనకు బలం చేకూరేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. 1948 సెప్టెంబర్17న సైనిక చర్యతో నిజాం రాజు పాలన నుంచి తెలంగాణా ప్రజలకు విముక్తి వచ్చిందన్నది నిజం. భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు కాబట్టి తెలంగాణా స్టేట్ ఇండియన్ యూనియన్ లో విలీనమైందని కొందరి వాదన. ఈ వాదన చేసేవాళ్లంతా సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరపాలంటున్నారు. అయితే సెప్టెంబర్ 17న తెలంగాణా పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదు. సాంకేతికంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు తెలంగాణా స్టేట్ నిజాం పాలనలోనే ఉంది. నిజాం ఉన్నా పౌరప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో నిజాం నిరంకుశ పాలన, నరరూప రాక్షక్షుడైన ఖాసీం రజ్వీ వంటి రజాకార్ల తెలంగాణా ప్రజలు విముక్తి పొందారు కాబట్టి సెప్టెంబర్ 17ను విమోచన దినంగా పాటించాలని మరికొందరి వాదన.
1947, ఆగస్టు 15న బ్రిటీషు పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. తెలంగాణ స్టేట్ మాత్రం నిజాం పాలనలోనే ఉండిపోయింది. తాము స్వతంత్ర దేశంగానే కొనసాగుతామని కామన్వెల్త్ దేశాలకు ప్రతిపాదన పెట్టారు నిజాం. యూరోపియన్ దేశాలతో వ్యాపార సంబంధాల కోసం గోవాను లీజుకు తీసుకోడానికి పోర్చుగీసుతో ప్రయత్నాలు జరిపారు. హైదరాబాద్ ను విలీనం చేయడానికి చర్చల మార్గాన్ని అనుసరించాలనే ప్రతిపాదన చేశారు ప్రధాని నెహ్రూ. చివరి ప్రయత్నంగా మాత్రమే సైనిక చర్యలు ఉండాలన్నారు. భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాష్ట్రం మధ్య 1947లో 'స్టాండ్‌స్టిల్ ఒప్పందం' జరిగింది. ఏడాది కాలం పాటు ఎలాంటి మిలిటరీ చర్యలు లేకుండా యధాతథ స్థితి కొనసాగాలన్నది ఆ ఒప్పందం. అయితే నిజాం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రజాకార్లు భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత రజకార్ల ఆగడాలు పెరిగిపోయాయి. ప్రైవేట్ సైన్యం బరి తెగించింది. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. గ్రామాల్లో రైతుల సాయుధ దాడులకు దిగారు. దీంతో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. మరోవైపు ఇయాక్ ఆలీ, ఖాసీం రజ్వీలు నిజాం నవాబుకు తెలియకుండానే ఫర్మానాలు జారీచేస్తూ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. పరిస్థితి చేయి దాటడంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది.
అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకుని మిలిటరీ యాక్షన్ మొదలుపెట్టారు. అప్పటి మేజర్ జనరల్ జేఎన్ చౌదురికి పక్కా ప్లాన్ రూపొందించారు. సెప్టెంబరు 13న ఆపరషన్ పోలో మొదలైంది. భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక్కోవైపు నుంచి చుట్టుముట్టింది. భారత సైన్యంతో గెలవడం సాధ్యం కాదనే భావించిన నిజాం రాజు.. తన ప్రధాని లియాక్ ఆలీని రాజీనామా చేయాలని ఆదేశించారు. కేబినెట్ ను రద్దు చేశారు. పటేల్ తరఫున భారత ఏజెంట్ కేఎం మున్షీకి ఇదే విషయాన్ని సెప్టెంబరు 17న నిజాం రాజు చెప్పారు. 1948 సెప్టెంబరు 17న నిజాం నవాబు సైన్యం భారత సైన్యానికి పరోక్షంగా లొంగిపోవడం, ప్రధాని సహా మొత్తం మంత్రివర్గం రద్దు కావడంతో భారత యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ లాంఛనంగా విలీనమైంది. డెక్కన్ రేడియోలో నిజాం నవాబు తన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వెంటనే మేజర్ జనరల్ జేఎన్ చౌదురికి మిలిటరీ జనరల్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. నిజాం నవాబును రాజ్‌ప్రముఖ్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు ఎనిమిది నెలల పాటు మిలిటరీ పాలనలో సాగిన హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు లేకుండానే ఐసీఎస్ అధికారిగా ఉన్న వెల్లోడీని సీఎంగా నియమించింది. సీఎంగా వెల్లోడీ, రాజ్‌ప్రముఖ్‌గా నిజాం నవాబు 1950 జనవరి 26 వరకూ కొనసాగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి