కేంద్ర హోంశాఖ సోమవారం భారత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో గల కథువా, సాంబా, జమ్ము, రాజౌరి, పూంచ్ జిల్లాల దగ్గర 14,000 బంకర్లు నిర్మించడానికి రూ.415 కోట్ల రూపాయలను విడుదల చేసింది. పలు నివేదికల ప్రకారం ఈ సంవత్సరం సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ 1,252 సార్లు నిబంధనలను తుంగలో తొక్కి కాల్పులకు తెగబడింది.
ఈ క్రమంలో వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి సరిహద్దు ప్రాంతంతో పాటు అంతర్జాతీయ సరిహద్దు భాగాలలో బంకర్ల నిర్మాణానికి భారత్ శ్రీకారం చుట్టింది. అలాగే సరిహద్దు ప్రాంతాలలో కాల్పుల ప్రమాదాల వల్ల మరణించే పౌరులకు కూడా నష్టపరిహారాన్ని పెంచనున్నట్లు హోంశాఖ తెలిపింది. అదే విధంగా జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో రెండు కొత్త బోర్డర్ బెటాలియన్లను నియమించనున్నట్లు హోంశాఖ అధికారులు తెలిపారు.
అలాగే తాజా హోంశాఖ ఉత్తర్వుల ప్రకారం అయిదు ఇండియా రిజర్వ్ బెటాలియన్స్ కూడా దేశ సరిహద్దు భాగాల్లో కాపుగాయనున్నాయి. అందుకోసం ఇప్పటికే 4690 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు.. వారు వచ్చే నెల డ్యూటీలో చేరనున్నట్లు సమాచారం. అలాగే 6,689 ఎస్పీఓలను కూడా రిక్రూట్ చేశారు. అలాగే సీఎపీఎఫ్, అస్సాం రైఫిల్స్ కోసం 2016-17 సంవత్సరానికి గాను 1,079 మందిని రిక్రూట్ చేసుకున్నారు. 2014-2017 వరకు ఆర్మీలో దాదాపు 7,302 మంది యువకులను తీసుకున్నారు.
భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో 14,000 బంకర్లు నిర్మిస్తాం: హోంశాఖ