18,428 పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తుల ప్రారంభం

18,428 పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తుల ప్రారంభం

Last Updated : Jun 8, 2018, 09:58 AM IST
18,428 పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తుల ప్రారంభం

ఇటీవల తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించిన 18,428 కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు www.tslprb.in వెబ్ సైట్ ద్వారా రేపు ఉదయం 8 గంటల నుంచి జూన్ 30 అర్థరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఇప్పటికే పోలీస్ ఉద్యోగాలకు వయపరిమితిని మూడేళ్ల పాటు ప్రభుత్వం పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వయో పరిమితి పెంపు ప్రకారం నోటిఫికేషన్‌ను సవరించి ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. కాగా ఈ పోస్టులకు 8 లక్షల దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వ వర్గాల అంచనా.

రాష్ట్రంలో మొత్తం 18,428 పోలీస్‌ ఉద్యోగాలకు మే 31న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గత ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం గనక వయో పరిమితి పెంచాలంటూ నిరుద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. ప్రభుత్వం స్పందించి వయో పరిమితిని పెంచుతూ గురువారం పోలీస్‌శాఖకు ఉత్తర్వులు పంపింది.

ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుళ్లు, జైళ్లు, అగ్నిమాపక శాఖలో మొత్తం నాలుగు నోటిఫికేషన్లు జారీ చేశారు. ప్రధానంగా ఎస్సై ఉద్యోగాలకు గతంలో 21-25 ఏళ్ల వరకు వయో పరిమితి ఉంది. తాజా నిర్ణయంతో 28 ఏళ్లు కల్గినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గతంలో కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు 18-22 ఏళ్లుగా గరిష్ఠ పరిమితి పెట్టగా.. ఇప్పుడు 25 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Trending News