8Th Pay Commission Big Update: ఎనిమిదో వేతన సంఘం త్వరలోనే వస్తుందని కేంద్ర ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిదో వేతన సంఘంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకట చేయలేదు. మరోసారి 8Th Pay Commission తెరపైకు వచ్చింది. కొత్త వేతన సంఘం ఏర్పాటుపై ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం 8వ వేతన సంఘం ఇప్పుడు ఏర్పాటు చేసినా.. దాని సిఫార్సులు 2026 జనవరి నుంచి అమలులోకి వస్తాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ జనవరి 2026 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో బంపర్ పెరుగుదల ఉంటుందని శివ గోపాల్ మిశ్రా అన్నారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందే కొత్త పే కమిషన్‌పై ప్రకటన వస్తుందని అందరూ ఆశించగా.. కేంద్రం నుంచి అలాంటి ప్రకటన ఏమి రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ప్రతి పదేళ్లకు ఒక కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయడం అనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం పదవి కాలం డిసెంబర్ 2025తో ముగుస్తుంది. ఇప్పుడు కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తే.. రెండేళ్ల తరువాత అంటే జనవరి 2026 నుంచి సిఫార్సులు అమలులోకి వస్తాయి.
ఎనిమిదో వేతన సంఘం అమలులోకి వస్తే.. ఉద్యోగుల బేసిక్ పే రూ.26 వేలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభిస్తుంది.
జీతాల పెంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మోదీ సర్కారుకు రిక్వెస్టులు పంపిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 8th వేతన సంఘంపై అధికారికంగా ఎలాంటి ప్రకట చేయలేదు. అతి త్వరలోనే ప్రకటన వస్తుందని అందరూ భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఏడాదికి సంబంధించిన రెండో డీఏ పెంపు కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీఏ పెంపు ఈసారి 3 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంటుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై నెల నుంచి అమలులోకి వస్తుంది.