Independence Day 2023 Long Weekend: పని ఒత్తిడిలో పడి కొట్టుకుపోతున్న వేతన జీవులకు కళ్ల ముందు టార్గెట్లు తప్ప ఇంకేమీ కనిపించడంలేదు. కానీ పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు.. అలాగే మానసిక ఉల్లాసాన్ని కోల్పోవద్దు. ఈ రెండూ కూడా మీ జీవితంపై తీవ్రమైన దుష్ర్బభావాన్ని చూపిస్తాయి. అందుకే అప్పుడప్పుడు అన్ని బాధలు మర్చిపోయి మనసుకు నచ్చే పనులు కూడా చేస్తుండాలి. అలాంటి వాటిలో విహార యాత్రలు ఎప్పుడూ ముందే ఉంటాయి.
Independence Day 2023 Long Weekend : ఈసారి ఆగస్టు 15 మంగళవారం వస్తోంది. అంటే ఆగస్టు 14 నాడు ఒక్కరోజు సెలవు తీసుకుంటే.. శనివారం, ఆదివారం ఎలాగూ కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ జీవులకు వీకెండ్ హాలీడేస్ వస్తున్నాయి కనుక వరుసగా శనివారం నుండి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. అంటే ఈ ఏడాది వచ్చిన లాంగ్ వీకెండ్స్‌లో ఇది కూడా ఒకటన్నమాట. ఈ నేపథ్యంలో సరదాగా అలా తిరిగొద్దాం అనుకునే వారి కోసం ఇదిగో ఈ 5 టూరిస్ట్ ప్లేసెస్ డీటేల్స్.
Independence Day 2023 Long Weekend Plans: వీకెండ్ వచ్చిందంటే చాలు సరదాగా అలా వీలైనంత ప్రపంచాన్ని చుట్టేసొద్దాం అని అనుకునే వారికి కొదువే లేదు. అందులోనూ లాంగ్ వీకెండ్ అంటే కచ్చితంగా ఇంకొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఇదిగో ఈ డీటేల్స్.
Coimbatore's Lord Shiva idol at Isha Temple - కోయంబత్తూర్‌లో ధ్యానముద్రలో ఉన్న పరమ శివుడి విగ్రహం : భారతీయ జీవన విధానంలో ఒక ముఖ్య భాగమైన యోగాను ఇష్టపడే వారికి, ఆధ్యాత్మిక భావనలో గడపడం ఇష్టమైన వారికి తమిళనాడులోని కోయంబత్తూరు రైట్ ఆప్షన్. కొండ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఈషా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఈషా టెంపుల్ సిటీ అద్భుతంగా కనిపిస్తుంది. ఆది యోగిగా పేరున్న ఆ పరమ శివుడు ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్న ఎత్తైన విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. 2017 లో మహా శివరాత్రి నాడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఈషా టెంపుల్ ప్రారంభోత్సవం జరుపుకుంది.
Darjeeling Tourism : డార్జిలింగ్ అందాలు Darjeeling Tourism : పశ్చిమ బెంగాల్లో హిమాలయాల కింది భాగంలో ఉండే అందమైన హిల్ స్టేషన్ ప్రాంతమే ఈ డార్జిలింగ్ . బ్రిటిషర్లు మన దేశాన్ని దోచుకునే రోజుల్లో వేసవి వస్తే ఇక్కడికి మకాం మార్చి రూలింగ్ చేసే వారు అని చరిత్ర చెబుతోంది. అంటే మండు వేసవిలోనూ యావత్ దేశం ఎండ వేడితో అల్లాడిపోతున్నప్పటికీ.. డార్జిలింగ్ మాత్రం చల్లగా అక్కున చేర్చుకుంటుందన్నమాట. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో డార్జిలింగ్ లోనూ పర్యాటకలు సందడి పెరుగుతోంది.
Port Blair - పోర్ట్ బ్లెయిర్ : సముద్రం మధ్య, ప్రకృతి అందాల నడుమ సేదతీరాలని కలలు కనే వారికి పోర్ట్ బ్లెయిర్ పర్‌ఫెక్ట్ డెస్టినేషన్. ఇక్కడి సెల్యులార్ జైలు కాలా పానీ లాంటి సినిమా కథలను గుర్తుచేస్తుంది. చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే వారైన.. లేదా ప్రకృతి ప్రేమికులైనా.. పోర్ట్ బ్లెయిర్ రైట్ ఛాయిస్ అవుతుంది. హేవ్‌లాక్ ద్వీపం, రాధానగర్ బీచ్ అందాలు గురించి చెప్పడం కంటే చూస్తేనే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. రూ. 20 వేల నుంచి 30 వేల మధ్య బడ్జెట్ పెట్టుకుంటే పోర్ట్ బ్లెయిర్ అందాలు తనివి తీరా చూసి రావొచ్చు.
Udaipur, Rajasthan : ఉదయ్‌పూర్ - రాజస్థాన్ రాజస్థాన్ అనే పేరుకి తగినట్టుగా రాజసం ఉట్టిపడే రాయల్ ప్యాలెస్‌లు, ఎన్నో రాజ భవంతులు, కోట కట్టడాలు, చారిత్రక కట్టడాలకు నెలవు ఉదయ్‌పూర్ సిటీ. పర్యటనకు వెళ్లినా.. లేదా హోటల్లో స్టే చేసినా.. రాజ భవనాల్లో తిరుగుతున్నామా అనే భావన వచ్చేలా అక్కడి కట్టడాలు ఉంటాయి. రాజుల కాలం నాటి అందమైన నిర్మాణాలు, కొలనులు, రాజ భవనాలు, కోటలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ప్రత్యేకతలు ఉదయ్‌పూర్ సిటీ సొంతం.
Delhi to Amritsar Golden Temple : ఢిల్లీ నుంచి అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ గురించి పరిచయం అక్కర్లేదు. అమృత్‌సర్ ఎంతో ప్రశాంతమైన టెంపుల్ సిటీ. ఇక్కడి స్వర్ణ మందిరం అందాలు, చుట్టూరా పరిశుభ్రమైన, చెరువును తలపించే అతి పెద్ద నీటి కొలను, అందులో రంగురంగుల చేపలు, అక్కడ ప్రసాదంగా అందించే ఎంతో రుచికరమైన హల్వా, స్థానికంగా ఫేమస్ అయిన కుల్చె, స్వాతంత్ర్య ఉద్యమంలో అతి కీలక భాగమైన జలియన్ వాలా బాఘ్ ఊచకోత నెత్తుటి మరకలు, ఆనాటి కన్నీటి గాధలను కళ్లకు కట్టినట్టు చూపించే మ్యూజియం గ్యాలరీ, అతిపెద్ద అమరవీరుల స్థూపం ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అన్నిటింకి మించి భారత్ - పాకిస్థాన్ మధ్య రోడ్డు, రైలు మార్గం పంచుకుంటున్న ఏకైక సరిహద్దు వాఘా బార్డర్ కూడా అమృత్‌సర్‌కి కేవలం 30 కిమీ దూరంలోనే ఉంటుంది. వాఘా సరిహద్దుల్లో భారత్ - పాక్ సైనికులు ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు చేసే బీటింగ్ రిట్రీట్ సెరెమనీ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఢిల్లీ నుంచి రైలు మార్గం ద్వారా ఎక్స్‌ప్రెస్ రైలులో 6 గంటల ప్రయాణం. ఇద్దరు వ్యక్తులు రూ. 5 నుంచి 6 వేల రూపాయల ఖర్చుతో అమృత్‌సర్ చుట్టేసి రావొచ్చు.