Mahalaya Paksham : పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లి తండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవ ప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి.
శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారు.
ప్రతి మాసంలోను అమావాస్య , పితరుల పుణ్య తిథిగా భావించబడినా, మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది.
ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో ఆనందింపజేస్తే వారు తమ సంతతి వారి ఆయువు, విద్య , ధనం , సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కాని ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది.
అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలాన్నిస్తుందనేది ప్రతీతి.