IPS Charu Nigam: మారు వేషంలో పోలీసులకు చుక్కలు చూపించిన లేడీ ఐపీఎస్ ఆఫీసర్

IPS Charu Nigam Viral Video: ఒక సాధారణ యువతి నుంచి అందిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తన వద్ద ఉన్న బ్రౌన్ కలర్ పర్సు దొంగిలించారని ఆ యువతి పోలీసులకు తెలిపారు. తనకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులపై ఒత్తిడి చేశారు.

Written by - Pavan | Last Updated : Nov 6, 2022, 05:18 AM IST
IPS Charu Nigam: మారు వేషంలో పోలీసులకు చుక్కలు చూపించిన లేడీ ఐపీఎస్ ఆఫీసర్

IPS Charu Nigam Viral Video: ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి తాను ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న జిల్లాలో పోలీసుల పని తీరు ఎలా ఉందో తెలుసుకోవాలని భావించారు. బాధితులు చేసే ఫిర్యాదులపై పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తున్నారో తెలుసుకోవాలని తలిచిన ఆమె.. తానే మారువేషంలో రంగంలోకి దిగారు. బైక్స్ పై వచ్చిన ఒక ముఠా దారిన వెళ్తున్న వారిని దోచుకుంటోందని 112 కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారో చూడాలని ఆమె ఈ పని చేశారు.

ఒక సాధారణ యువతి నుంచి అందిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తన వద్ద ఉన్న బ్రౌన్ కలర్ పర్సు దొంగిలించారని ఆ యువతి పోలీసులకు తెలిపారు. తనకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులపై ఒత్తిడి చేశారు. పోలీసులు తనని గుర్తుపట్టడానికి వీల్లేకుండా స్కార్ఫ్ చుట్టుకున్నారు. కళ్లకు షేడ్స్ పెట్టుకున్నారు. దాంతో తమ కళ్ల ముందు మారు వేషంలో ఉంది తమ బాసేనని పోలీసులు కూడా గుర్తుపట్టలేకపోయారు. 

యువతి చెప్పిన వివరాల ఆధారంగా ఆ దారిలోంచి వచ్చిపోయే వారిని ఆపి వారిని తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వారి వివరాలు నమోదు చేసుకుని ప్రశ్నించారు. పోలీసులు స్పందించిన తీరు సరిగ్గానే ఉందని భావించిన సదరు ఐపీఎస్ ఆఫీసర్.. అప్పుడు పోలీసుల ఎదుట తన అసలు స్వరూపాన్ని చూపించారు. అప్పటివరకు ఆమెను ఒక సాధారణ ఫిర్యాదుదారురాలిగానే భావించిన పోలీసులు.. ఉన్నట్టుండి తమ జిల్లా ఎస్పీ కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేసరికి అవాక్కయ్యారు. ఇప్పటి వరకు ఒక సాధారణ యువతిగా ఫిర్యాదు చేసింది మీరేనా మేడం అంటూ ఆమెకు సెల్యూట్ చేశారు.

 

ఆ ఐపీఎస్ ఆఫీసర్ మరెవరో కాదు.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరైయా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న చారు నిగమ్. పోలీసుల పని తీరును, ఫిర్యాదు చేయడానికి వచ్చే వారి పట్ల వారి ప్రవర్తనను పరిశీలించడానికి ఐపిఎస్ ఆఫీసర్ చారు నిగమ్ చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురిసేలా చేసింది. చారు నిగమ్ పని తీరుకు మెచ్చిన నెటిజెన్స్.. మీ లాంటి పోలీసు ఆఫీసర్ జిల్లాకు ఒకరుంటే చాలు.. ఆ జిల్లా పోలీసులు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తారు అంటూ ఆమెకు కితాబిస్తున్నారు.

Trending News