Narmada Pushkaralu 2024: ముక్తి దాయకం.. పుష్కర స్నానం.. రేపటి నుంచి నర్మదా నది పుష్కరాలు

Narmada Pushkaralu Dates and Duration: నర్మదా నదీ పుష్కరాలు రేపటి (మే 1) నుంచి ప్రారంభంకానున్నాయి. 12 రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా పుష్కర స్నానం ఆచరించేందుకు వెళ్తనున్నారు. ఏయే ఏ ప్రదేశాల్లో పుష్కరాలను నిర్వహిస్తారో ఇక్కడ తెలుసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2024, 05:59 PM IST
Narmada Pushkaralu 2024: ముక్తి దాయకం.. పుష్కర స్నానం.. రేపటి నుంచి నర్మదా నది పుష్కరాలు

Narmada Pushkaralu Dates and Duration: మేషే గంగా వృషే రేవా మిథునేతు సరస్వతీ కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మ్రతా కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ధటకే స్మ్రతా వృశ్చికే తామ్రపర్ణీచ చాపే పుష్కర వాహినీ మకరే తుంగభద్రాచ కుంభే సింధునదీ స్మ్రతా మీనే ప్రణీతా నదీచ గురోస్సంక్రమణే స్మ్రతా పుష్కరాఖ్యౌ మునీనాంహి బుధై స్మ్రతా.."

దేవగురువగు బృహస్పతి మేష రాశిలో ఉన్నప్పుడు గంగానదికి, వృషభరాశిలో ఉన్నప్పుడు నర్మదా నదికి, మిధున రాశిలో ఉన్నప్పుడు సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు యమునా నదికి, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలో ఉన్నప్పుడు కృష్ణా నదికి, తులారాశిలో ఉన్నప్పుడు కావేరి నదికి, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు తామ్రపర్ణి నదికి, ధనూరాశిలో ఉన్నప్పుడు బ్రహ్మపుత్రకు, మకర రాశిలో ఉన్నప్పుడు తుంగభద్రా నదికి, కుంభ రాశిలో ఉన్నప్పుడు సింధు నదికి, మీన రాశిలో ఉన్నప్పుడు ప్రణీతా నదికి, పుష్కరాలు చెప్పబడ్డాయి.

పుష్కరం అనగా జల స్వరూపం జలాది దేవతగా సమస్త తీర్థములకు నెలవై ఉండి తీర్థరాజు అను పేరుతో లోక కళ్యాణ కారకు డైనట్లు శాస్త్రములు తెలుపు తున్నాయి. పూర్వము తుందిలుడనే బ్రహ్మణోత్తముడు మహేశ్వరుని గూర్చి తపస్సు చేసి తన అష్ట-మూర్తులతో ఒకటైన జల స్వరూపముతో పుష్కరుడు అను నామముతో పరమ శివుని ఐక్యమై ఉండుటకు వరము పొంది, పరమే శ్వరుని సాయుజ్యము పొంది ఉండగా బ్రహ్మదేవుడు సృష్టిని శక్తివంతము చేయుటకై శివుని వరముతో ఆ పుష్కరుని స్వీకరించి, తన కమండలము నందు ఉంచుకొని సృష్టి కార్యం నిర్వహిస్తుండగా, బృహస్పతి బ్రహ్మను వేడుకొని  ఆ పుష్కరుని తన వెంట ఉండుటకై వరమును కోరెను. గ్రహాధి పత్యమును, ముక్కోటి దేవతలకు గురువుగాను ఆపుష్కరుని సన్నిదిని శక్తి వంతుడై యుండునట్లు కోరుకొనగా పుష్కరుడు బ్రహ్మను వీడి రాకకు సమ్మతించక పోగా బ్రహ్మదేవుడు, ఆ పుష్కరుని కోరికపై ముక్కోటి దేవతలతో మూడున్నర కోట్ల తీర్థములతో, మహర్షులతో, ఆ పుష్కరుని వెంట ఉండి, బృహస్పతి, ఆయా రాసులలో (మేషాది రాసులలో) చరించు చున్నప్పుడు ఆయా నదులకు (మేషేచ-గంగా) అను సూత్రాను సారం పుష్కరాలు నిర్వహిస్తారు.

ప్రతి నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రోజులపాటు పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా 2024 మే 1 బుధవారం మధ్యాహ్నం 12.56 గంటలకు దేవగురు బృహస్పతి వృషభ రాశి యందు ప్రవేశించినది మొదలు  మే 12 ఆదివారం వరకు నర్మదా నది పుష్కరాలు నిర్వహిస్తారు.

"రేవా తీరే తప: కుర్యాత్‌ మరణం జాహ్నవి తటే
దానం దద్యాత్‌ కురుక్షేత్రే గౌతమీమ్యాం త్రిత యం పరం"
"రేవా నది తీరాన తపస్సు చేస్తే ముక్తి. గంగా తీరాన మరణం ముక్తి. కురుక్షేత్రంలో దానం ముక్తి. గోదావరిలో స్నానం చేస్తే ఈ మూడు పుణ్యాలు లభిస్తాయి." అని పై శ్లోకానికి అర్థం.
నర్మదను మహానదంగా చెప్పడం ప్రసిద్ది. తూర్పున పూర్వపు కళింగ దేశము, ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రములో షాహోల్ జిల్లా కేంద్రంగా పడమట భాగమున 'అమరకంటక్' అనే పర్వతం నర్మదా నది జన్మస్థానము. అమర కంటక్ సముద్రమట్టానికి సుమారు 3495 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడ అతి ప్రధానమైనది నర్మదాదేవి ఆలయం. ఈ ఆలయానికి ఆనుకొనే ఒక చిన్న కొలను ఉంది. ఈ కొలనులో నీరు నిరంతరమూ ఊరుతూ ఉంటుంది.

ఇలా ఊరుతున్న నీటిలో నుంచి నర్మదానది ప్రభవించి ముందుకు సాగుతుంది. ఇలా పడమరగా ప్రవహించిన నర్మద సుమారు 33 కి. మీ. దూరంలో 70 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలాగ కిందికి దూకుతుంది. దీనికి 'కపిలధార' అని పేరు. కపిలమహర్షి ఇచ్చట తపస్సు చేసుకుంటూ ఉండేవారట. కొంచెం దూరంలో నర్మదానది మరొక జలపాతంవలె పుడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ నది పాలవలె తెల్లగా నురుగులు తేలుతూ ఉంటుంది. అందువల్ల దీనిని 'దుగ్ధధార' అని పిలుస్తారు. నర్మదానది జన్మస్థలం అని చెప్పబడే కోనేరు నుంచి మరికొంత దూరంలో మరొక చిన్నకుండం ఉన్నది. దీనిని సోన్ / ముధా/ (సోమోద్భవ) మేఖల కన్యన (ఝహీలా) నదులు కూడా పుట్టినవి. సోన్, ముధాకు దక్షిణంగా కొద్ది దూరంలో భృగుమండలం ఉంది. పూర్వం ఈ స్థలంలో భృగుమహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవారట. ఆయన కమండలంలో నుండి, ఒక చిన్నధార ఉద్భవించగా దానిని 'కరగంగ' అని పిలుస్తారు. మధ్యప్రదేశ్లోని 'అమరకంటక్' పర్వతం నుండి పుట్టిన నర్మద గుజరాత్లోని 'కచ్సింధు శాఖ'లోని అరేబియా సముద్రంలో కలియుచున్నది. శోణ, నర్మద, ఝహీలా అనే మూడు నదులు ఒకే ప్రదేశంలో అమరకంటక్ వద్ద పుట్టినవి. నర్మదానది విశేషమేమంటే అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంటే, ఈ నర్మదా నది మాత్రం పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది.

పూర్వం బ్రహ్మకల్పంలో పుష్కర నదులలో రెండవదైన నర్మద శివుని శరీరం నుండి వచ్చిన స్వేదబిందువులు (చెమట) ద్వారా పుట్టినదని పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రథమంలో దీనిని ‘రుద్రకన్య'గా పిలువబడింది.  ఈ నది ఏనాడు ఎండిపోవడం జరగదని భక్తుల విశ్వాసం. హరివంశంలో వివరించిన ప్రకారం నర్మద చంద్రుని పుత్రికగాను, పురుకుత్సుని భార్యగాను వర్ణించారు. నర్మదను మహానదంగా పిలువడం ప్రసిద్ది. నర్మదానది రెండు యోజనముల వెడల్పు గల ప్రవాహంతో నూరు యోజనములు ప్రవహించుచున్నది.

కూర్మ పురాణాన్ననుసరించి మార్కండేయుడు పూర్వము ధర్మరాజుకి చెప్పినది అమరకంటక్ పర్వతమందు మహత్తరమైన అరువది వేల తీర్థాలున్నవన్నట్లు తెలియజేస్తాడు. మత్స్యపురాణాన్ననుసరించి నర్మదానదీ తీరమున యంత్రేశ్వర, మేఘనాధ, ఆమ్రీ, తకేశ్వర, గాణేశ్వర, కుండ ప్రబృతి మొదలైన  మహత్తరమైన తీర్థములున్నట్లు తెలుస్తున్నది.

నర్మదానదికి చెందిన తీర్థములలో ఓంకార, కపిలా, సంగమ, అమరెవ తీర్థములు స్మరించినంతనే పాపములు నశించి అఖండ పుణ్యము కలుగునని విశ్వాసం.

స్నాన యోగ్యమైన పుణ్య క్షేత్రాలు నాగేశ్వరం, ఓంకారేశ్వర్, అమరేశ్వర్, జబ్బల్పూర్, బరూచ్, హోసుంగాబాద్ మొదలైనవి.

నర్మదానదీ తీరక్షేత్రాలలో ప్రధానమైనవి అమరకంటక్, ఓంకారం, అమరేశ్వరం, జబ్బల్పూర్, బరూచ్, హెసుంగాబాద్, అంకలేశ్వర్ దగ్గర నాగేశ్వర్ ప్రధానమైన క్షేత్రాలు. నర్మదకు మరోపేరు రేవానది. రేవానది (సిప్రానది) తీరంలో శివుని జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వరం మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్నది.

ఇదే కాకుండా ప్రసిద్ది చెందిన దాదాపు యాభై క్షేత్రాలలో ఓంకారేశ్వర్, కాళేశ్వర్, మార్కండేశ్వర్, జమదగ్నేశ్వర్, పాతాళేశ్వర్, అంబుధేశ్వర్, హరణేశ్వర్, బలేశ్వర్, శాండిల్వేశ్వర్ మొదలైన పేర్లతో అనేక శివాలయాలే కాకుండా, రామాలయాలు కూడా ప్రసిద్ధినొందినవి.

   రామ కిష్టయ్య సంగన భట్ల 
     9440595494

Trending News