15 ఏళ్ల కుర్రాడు రికార్డ్.. కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చిన బాల షూటర్

అనీష్ భన్వాలా.. ఇప్పుడు ఈ పేరు దేశం మొత్తం మారు మ్రోగిపోతోంది. ఎందుకంటే ఈ 15 ఏళ్ళ కుర్రాడు కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి బంగారు పతకం తెచ్చిన తొలి పిన్నవయస్కుడిగా వార్తల్లోకెక్కాడు.

Updated: Apr 13, 2018, 11:21 AM IST
15 ఏళ్ల కుర్రాడు రికార్డ్.. కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చిన బాల షూటర్
Image Credit: Reuters
అనీష్ భన్వాలా.. ఇప్పుడు ఈ పేరు దేశం మొత్తం మారు మ్రోగిపోతోంది. ఎందుకంటే ఈ 15 ఏళ్ళ కుర్రాడు కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి బంగారు పతకం తెచ్చిన తొలి పిన్నవయస్కుడిగా వార్తల్లోకెక్కాడు. పురుషుల 25 మీటర్ల ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో ఈ కుర్రాడు సత్తా చాటాడు. ఈ బాల షూటర్ తొలిసారిగా ఈ క్రీడల్లో పాలుపంచుకోవడం గమనార్హం.
 
సెప్టెంబరు 26, 2002 సంవత్సరంలో హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో జన్మించిన అనీష్ గతంలో జూనియర్ ప్రపంచ కప్‌తో పాటు జూనియర్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో కూడా మనదేశానికి బంగారు పతకాలు తీసుకువచ్చాడు. ఏడేళ్ళ వయసు నుండే షూటింగ్ అంటే అమితమైన ఆసక్తి పెంచుకున్న అనీష్.. తన పదవ తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా.. కామన్వెల్త్ క్రీడల కోసం కొన్నిపేపర్లను రాయకుండా వదులుకోవాల్సి వచ్చింది. అయితే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ బాలుడికి సపోర్టు చేస్తూ.. మలివిడతలో పరీక్షలు రాయించాల్సిందిగా బోర్డుకి రికమెండేషన్ లెటర్ పంపింది. 
 
గతంలో అభినవ్ బింద్రా కూడా కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న తొలి పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. అయితే అదే కామన్వెల్త్ క్రీడల్లో పిన్నవయస్కుడిగా పాల్గొనడం మాత్రమే కాదు.. అలా పాల్గొని బంగారు పతకం కూడా తీసుకొచ్చిన ఘనత అనీష్ భన్వాలాకి మాత్రమే దక్కింది. అనీష్ తాజాగా తెచ్చిన పతకంతో భారత్ ఖాతాలో 16 బంగారు పతకాలు చేరాయి. ఈ క్రీడల్లో పురుషుల 25 మీటర్ల షూటింగ్ ఫైర్ పిస్టల్ పోటీల్లో తాను ఆస్ట్రేలియా యువ షూటర్ సర్గే ఎవ్‌గ్లేవస్కీతో గట్టి పోటీ ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఫైనల్‌లో అతని కంటే ఎక్కువ పాయింట్లు రావడంతో అనీష్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.