ఆసియా కప్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ ధాటికి శ్రీలంక నిలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 249 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన శ్రీలంక బ్యాట్స్‌మన్ కేవలం 158 పరుగులకే కుప్పకూలారు. ఆఫ్ఘన్ బ్యాట్స్‌మన్లలో ఇషానుల్లా (45 పరుగులు), హష్మతుల్లా షాహిది (37 పరుగులు), రహమత్ షా (72 పరుగులు), మహ్మద్ షెహజాద్ (34 పరుగులు) రాణించగా.. శ్రీలంక బౌలర్లలో పెరీరా 5 వికెట్లు తీసుకొని.. ఆఫ్ఘన్ల పరుగుల వరదకు అడ్డుకట్ట వేశాడు.
అయితే ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన శ్రీలంక బ్యాట్స్‌మన్లకు.. ఆఫ్ఘన్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఉపుల్ తరంగా చేసిన 36 పరుగులే అత్యధిక స్కోరు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు శ్రీలంక బ్యాట్స్‌మన్లు ఎంతలా విఫలమయ్యారో..! తరంగా తర్వాత ధనంజయ డీసిల్వా (23 పరుగులు), పెరీరా (28 పరుగులు) మాత్రమే కొద్దో గొప్పో రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అందరూ సమిష్టిగా రాణించి ముజీబ్ రెహమాన్, ఆఫ్తబ్ ఆలమ్, గుల్బదీన్ నయిబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరొక 2 వికెట్లు తీసుకున్నారు.