బాల్ టాంపరింగ్ తరువాత కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ మార్పులు చేసింది. ఏ క్రీడకు సంబంధించిన ఆటగాళ్లు అయిన మైదానంలో హుందాగా ప్రవర్తించాలి. అయితే ఈ మధ్య క్రికెట్‌లో ఆటగాళ్లు హద్దులు మీరుతూ ఆట పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. దీంతో ఐసీసీ నిబంధనలను మారుస్తూ కాస్త కఠిన శిక్షలు చేసింది.
బాల్ టాంపరింగ్ వివాదమప్పుడే నిబంధనలను మార్చాలని ఐసీసీ భావించింది. కానీ వాటికి ఇప్పుడు ఆమోదం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్న క్రికెట్ లో అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఐసీసీ స్పష్టం చేసింది.
మోసం చేయడం, దూషించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, బాల్ ఆకారాన్ని మార్చడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు ఉండనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం.. బాల్ టాంపరింగ్‌ను లెవల్-3 నేరంగా పరిగణించకుండా.. గరిష్టంగా 12 సస్పెన్షన్ పాయింట్లు విధిస్తారు. ఈ పాయింట్లు దాటితే సదరు ఆటగాడిపై 6 టెస్టులు లేదా 12 వన్డేలు నిషేధం విధించడంతో పాటు.. సంబంధిత బోర్డుకు కూడా బాధ్యులను చేసి జరిమానా విధించనున్నామని ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.