IND vs SL T20 Preview: వెస్టిండీస్ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్ లలో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా.. ఇప్పుడు శ్రీలంక జట్టుపై ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెటర్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇప్పుడు శ్రీలంకతో సిరీస్ లో భాగంగా మూడు టీ20లు, రెండు టెస్టులను రోహిత్ సేన ఆడనుంది. గురువారం (ఫిబ్రవరి 24) నుంచి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. లక్నోలోని భారతరత్న అటల్ బిహార్ వాజ్ పేయ్ క్రికెట్ స్టేడియం వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. గురువారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
కీలక ఆటగాళ్లు దూరం
శ్రీలంక పర్యటనలో భారత స్టార్ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లకు విశ్రాంతి ఇవ్వగా.. మరోవైపు గాయాల కారణంగా కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ లు తప్పుకున్నారు. శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ గురువారం జరగనుంది.
ఈ సిరీస్ లో టీమ్ఇండియా ఫేవరేట్ గా బరిలో దిగుతుంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ను పూర్తి చేసుకున్న లంక జట్టు.. అందులో 1 -4 తేడాతో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లను ఎదుర్కొవడం లంక క్రికెటర్ల పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.
యువ క్రికెటర్లకు ఛాన్స్?
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు టీమ్ఇండియా మేనేజ్ మెంట్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే జట్టులోని కీలక ఆటగాళ్లు లంక సిరీస్ కు దూరంగా ఉండడం వల్ల వారి స్థానాల్లో యువ క్రికెటర్లకు అవకాశమిచ్చి.. వారిని పరీక్షించే అవకాశం ఉంది.
శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్‌లను ఆడించే అవకాశం ఉంది. వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వికెట్ కీపర్ స్థానానికి పోటీగా ఇషాన్ కిషన్ ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో శాంసన్ కు చోటు దక్కాలంటే లంక సిరీస్ అతడికి కీలకం కానుంది. మరోవైపు దీపక్ హుడాకు సరైన అవకాశం ఇవ్వొచ్చు.
మరోవైపు బౌలింగ్ దళంలో భువనేశ్వర్ తో పాటు ఈసారి బుమ్రా బరిలో దిగనున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న ఈ పేసర్.. ఇప్పుడు లంక సిరీస్ లో ఆడనున్నాడు. వీరితో పాటు హర్షల్ పటేల్ లేదా సిరాజ్ ఫాస్ట్ బౌలింగ్ స్థానానికి ఎంపిక చేయవచ్చు. ఆల్ రౌండర్ జడేజా కూడా ఈ సిరీస్ తో రీఎంట్రీ ఇస్తున్నాడు. స్పిన్నర్ల విషయానికి వస్తే.. చాహల్, రవి బిష్ణోయ్ ను ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
టీమ్ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా/ రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్/ మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: నిశాంక, గుణతిలక, అసలంక, చండిమాల్, కుశాల్ మెండిస్, దినేష్ శనక, కరుణరత్నె, తీక్షణ, వాండర్సే, చమీర, లహిరు కుమార.
Also Read: గొప్ప మనసు చాటుకున్న టీమిండియా క్రికెటర్.. బాలుడి శస్త్ర చికిత్స కోసం రూ.31 లక్షల విరాళం!!
Also Read: IPL Australia Players: ఈ ఏడాది ఐపీఎల్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు దూరం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook