ఇండియా vs సౌతాఫ్రికా 2వ టీ20: లెక్క లెవల్ చేసిన సఫారీలు

ఇండియా vs సౌతాఫ్రికా 2వ టీ20 : లెక్క లెవల్ చేసిన సఫారీలు

Last Updated : Feb 22, 2018, 02:32 AM IST
ఇండియా vs సౌతాఫ్రికా 2వ టీ20: లెక్క లెవల్ చేసిన సఫారీలు

టీ20 సిరీస్‌పై తమ ఆశలు సజీవం చేసుకునేందుకు కీలకమైన మ్యాచ్‌లో సఫారీలు జూలు విధిల్చారు. 189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో క్లాసెన్ (30 బంతుల్లో 69; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), డుమిని (40 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి బాదడంతో సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి మ్యాచ్ ఓడిపోయిన సఫారీలు ఈ మ్యాచ్ గెలిచి 1-1తో లెక్క లెవల్ చేశారు. దీంతో ఇక ఆఖరి మ్యాచ్ అయిన 3వ టీ 20 మ్యాచ్‌లో గెలుపు ఇద్దరికీ మళ్లీ కీలకంగానే మారింది. భారత్ 3వ మ్యాచ్ గెలిస్తే, టీమిండియాకు రెండు భారీ విజయాలు సొంతమైనట్టే. అలా కాకుండా సఫారీ సేన గెలిస్తే, టీమిండియా కేవలం వన్డే సిరీస్ టైటిల్‌తో ఇంటి బాట పట్టాల్సి వుంటుంది. 

సెంచూరియన్‌లో బుధవారం తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేయగలిగింది. మనీష్ పాండే (48 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ధోనీ (28 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లతో అద్భుతమైన పర్ ఫార్మెన్స్ కనబర్చారు. ఆ తర్వాత బరిలోకి దిగిన సఫారీలు 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు నష్టపోయి 189 పరుగులు చేయగలిగారు. ఇక సిరీస్‌కి కీలకమైన 3వ టీ20 శనివారం కేప్‌టౌన్‌లో జరగనుంది. 

Trending News