భారత అండర్-19 క్రికెట్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యారు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టుకి అతను ఎంపికయ్యాడు. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు శ్రీలంకలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే అర్జున్ మాత్రం నాలుగు రోజుల మ్యాచ్‌లలోనే ఆడనున్నట్లు తెలిసింది. అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన గ్లోబల్ టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అర్జున్ అదరగొట్టిన సంగతి తెలిసిందే.
అర్జున్ టెండూల్కర్ భారత అండర్-19 క్రికెట్ టీంకు ఎంపిక కావడం పట్ల సచిన్ స్పందించారు. తన కుమారుడు అర్జున్ అండర్ 19 జట్టులో చేరడం సంతోషాన్నిస్తోందని సచిన్ టెండూల్కర్ తెలిపారు. అతడి అభిరుచులకు ఎప్పుడూ అండగా నిలిచానని ఇప్పుడు గెలుపు కోసం ప్రార్థిస్తానని చెప్పారు. అర్జున్ జీవితంలో ఇది ఓ కీలక ఘట్టంగా, ఉత్తమ అవకాశంగా సచిన్ చెప్పారు. కాగా అండర్ 19 జట్టులో కేవలం 19 సంవత్సరాలలోపు వారే ఉండాలని మిగితా వారంతా రంజీ జట్లకు వెళ్లాలన్న బీసీసీఐ, రాహుల్ ద్రావిడ్ నిర్ణయంతో చాలా మంది ఈ జట్టులో చోటు పొందలేదు.