శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వా తండ్రి రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి గురువారం అర్ధరాత్రి రాజకీయవేత్త అయిన రంజన్ డిసిల్వా(62)పై విచక్షణారహితంగా కాల్పులు జరుపగా.. రంజన్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన కొలంబో శివారులోని రత్మలానా వద్ద చోటుచేసుకుంది.
దీంతో శుక్రవారం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సిన ధనుంజయ శ్రీలంక జట్టు నుంచి తప్పుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం లంక జట్టు వెస్టిండీస్‌కు వెళ్లాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కొలంబో పోలీసులు తెలిపారు.
డిసిల్వా స్థానంలో ఎవరిని వెస్టిండీస్ పర్యటనకు పంపిస్తున్నారో శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. ఇప్పటికే చేతి వేలి గాయం కారణంగా ఓపెనర్ దిముత్ కరుణరత్నే ఈ పర్యటనకు దూరమైన సంగతి విదితమే. జూన్ 6 నుంచి శ్రీలంక-వెస్టిండీస్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది.
Sri Lanka Cricket expresses its sincere condolences on the tragic demise of Mr.Ranjan De Silva, father of the national cricketer Dhananjaya De Silva. pic.twitter.com/YM4d0OSyS2
— Sri Lanka Cricket (@OfficialSLC) May 25, 2018
కుడిచేతి బ్యాట్స్ మెన్ అయిన ధనుంజయ డిసిల్వా శ్రీలంక తరఫున 13 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. డిసెంబరు 2017లో న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పై డిసిల్వా సెంచరీ కూడా చేశాడు.