హైదరాబాద్ : రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలకు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జనవరి 22, బుధవారం నాడు జరగనున్నాయి. రాష్ట్రం మొత్తం మీద యూ ఎల్ బి లలో 53.37 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల పర్యవేక్షణ విభాగం 9 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 1438 పోలింగ్ స్టేషన్లను, 120మున్సిపాలిటీలకు గాను 6325 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను ఎన్నికల నిర్వహణ కొరకు 45,000 మందిని నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ రోజున ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఇప్పటికే సెలవు ప్రకటించింది.
అయితే, కార్పొరేషన్లలోని మొత్తం 325 డివిజన్లలోఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం కాగా, మున్సిపాలిటీలలోని 2,727 వార్డులలో 80 ఏకగ్రీవం అయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలోని డబీర్ పుర డివిజన్లో ఉప ఎన్నిక జరకానుంది. మరోవైపు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జనవరి 24 న పోలింగ్ జరకానుండగా, కరీం నగర్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం వరకు ప్రచారం కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఎన్నికలలో నకిలీ ఓట్లను నిరోధించడానికి దేశంలో తొలిసారిగా 'ఫేస్ రికగ్నిషన్ యాప్' ను అమలు చేయబోతున్నామని, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్ స్టేషన్లలో ఈ అప్లికేషన్ ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ ఎన్నికలలో తొమ్మిది కార్పొరేషన్లకు 325 మంది కార్పొరేటర్లను, 120 మునిసిపాలిటీలకు 2727 మంది కౌన్సిలర్లను ఎన్నుకుంటారని, అన్నీ జిల్లాల్లో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామని అధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి