అత్యాధునిక హంగులతో ఎమ్మెల్యే క్వార్టర్స్ రెడీ ; ప్రత్యేకతలు ఎన్నో..!!

హైదర్ గూడలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు  

Last Updated : Jun 17, 2019, 03:51 PM IST
అత్యాధునిక హంగులతో ఎమ్మెల్యే క్వార్టర్స్ రెడీ ; ప్రత్యేకతలు ఎన్నో..!!

హైదర్‌గూడ్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సిద్ధమైంది. ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన భవన సముదాయాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  కాగా ఈ నూతన భవన సముదాయంలో  ఈ సారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయిస్తారు.

అత్యాధునిక హంగులతో నిర్మాణం
ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన ఈ భవనం నిర్మాణానికి రూ.126 కోట్లు ఖర్చు చేశారు.  మొత్తం 4.26 ఎకరాల్లో మొత్తం 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టారు.ఈభవన సముదాయం 12 అంతస్తులతో ఐదు బ్లాకులు నిర్మించారు. ప్రజాప్రతినిధుల కోసం మొత్తం 120 ప్లాట్లను ఒక్కొక్కటీ 2500 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫ్లాట్లలో పెద్దల పడకగది, పిల్లల పడకగది, కార్యాలయం, వంటగదితోపాటు స్టోర్‌ రూం ఉంటాయి. భవన కింది భాగంలో ఒక్కో సభ్యుడికి రెండుకార్లకు అవసరమైన పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. 

సిబ్బంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు
వీటికి అనుబంధంగా ఈ భవనంలో సిబ్బంది కోసం మరో 36 ఫ్లాట్లను ఒక్కొక్కటీ వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. సహాయకుల కోసం మరో 120 ఫ్లాట్లను ఒక్కొక్కటీ 325 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. వీటితో పాటు గృహ సముదాయం ఆవరణలో ఒక భద్రతా కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ఐటీ, మౌలిక సదుపాయాల కోసం 1.25 లక్షల చదరపు అడుగులతో  ప్రత్యేకంగా బ్లాక్‌ను నిర్మించారు. మొత్తం ఎనిమిది లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 23 సమావేశ క్యాబిన్లను కూడా ఏర్పాటుచేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను కలువడానికి వీలుగా వీటిని నిర్మించారు.

భవన నిర్మాణానికి ఏడేళ్లు
ఎమ్మెల్యే , ఎమ్మెల్సీల కోసం హైదరాబాద్ లోని ఆదర్శనగర్‌లో, హైదర్‌గూడలో పాత గృహ సముదాయాలున్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో 2012 కొత్త భవనాల నిర్మాణం చేశారు. కానీ పూర్తి చేసేందుకు ఏడేళ్లు పట్టింది. 

Trending News