Congress Leaders Fight in Khammam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు- అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య మధ్య అధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ములుగు నియోజకవర్గానికి చెందిన పోదెం వీరయ్య గత ఎన్నికల నుంచి భద్రాచలంలో పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో నియోజకవర్గం మారి వచ్చి భద్రాచలం నుంచి గెలిచారు. అయితే గత ఎన్నికల ముందు దళిత బంధు మంజూరీలో అనుచర వర్గం ముడుపులు తీసుకున్నారని ఫిర్యాదు రావడంతో ఆ ముడుపులను వెనక్కి ఇచ్చేసి సంచలనం సృష్టించారు. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ప్రజలకు ఆయనకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఆయన వర్గీయులే ప్రత్యర్ధులతో కుమ్మకై ఓడించారని జిల్లాలో ఓ టాక్. అయితే ఇక్కడ ఊహించని విధంగా బీఆర్‌ఎస్ నేతగా ఉన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ముందు పొంగులేటితో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత బీ ఫామ్‌లు ఇచ్చే సమయంలో తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలోకి జంప్ కొట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గెలిచిన వెంటనే క్షణం కూడా ఆగకుండా మళ్లీ అధికార పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తెల్లం వెంకట్ రావు.. అధికార పార్టీలోనూ చర్చనీయాశంగా మారిపోయారు..
also read: Prabhas: పబ్లిక్ ప్లేస్ లో ప్రభాస్ అలాంటి పని.. ఫ్యాన్స్ సైతం ఫైర్..ఫోటోలు వైరల్!
గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పొదెం వీరయ్య ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల సమయంలో రాజకీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన పార్టీ మారకుండా ఉండిపోయారు. అయితే ఇప్పుడు తెల్లం వెంకట్ రావు కూడా అధికార పార్టీలో ఉండటంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమంటోందట. ఒకే పార్టీలో రెండు కత్తులు అన్న చందంలా పరిస్థితి మారిపోయిందట. దీనికి ఆజ్యం పోసినట్టు ఇందిరమ్మ కమిటీలు మరింత చిచ్చు రేపాయని టాక్.. కొద్దిరోజులుగా భద్రాచలంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీల్లో మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వర్గానికి అస్సలు చోటు దక్కడం లేదట. ఇదే విషయమై దమ్ముగూడెం మండలంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పొదెం వర్గం ఫిర్యాదులు సైతం చేస్తోందట. అంతేకాదు ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావుకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు కట్టి మరి నిరసన వ్యక్తం చేశారట.. ఇప్పుడు ఈ విషయంలో పొదెం తీరుపై తెల్లం తీవ్రంగా రగిలిపోతున్నారట..
వాస్తవానికి గతంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా పొదెం వీరయ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆనాడు సాధ్యం కాలేదు. పొంగులేటి పట్టు పార్టీలో ఎక్కువగా ఉండడంతో తెల్లంను పార్టీలో చేరకుండా ఆపలేకపోయారు. అయితే ఇప్పుడు అక్కడ రెండు వర్గాల మద్య విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుకున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇందిరమ్మ కమిటీలు దీనికి మరింత ఆజ్యం పోసినట్టు చెబుతున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో పొదెం వర్గానికి మొండి చెయ్యి చూపిస్తున్నారు. తెల్లంకు సహకరించిన ఆనాటి బిఆర్ఎస్ నేతలకు, అలాగే వామపక్ష నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. గ్రామాల్లో ఈ విషయం కాస్తా వివాదం కావడంతో నేతలంగా పొదెంకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దాంతో ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దగ్గరే తేల్చుకుందాని పొదెం వారితో అన్నట్టు సమాచారం. త్వరలోనే భద్రాచలం నుంచి రెండు బస్సుల్లో వెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిసింది.
మొత్తంగా భద్రాచలంలో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ మరింత రెట్టింపు అయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యే తీరుపై పొదెం హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తే.. అప్పుడు ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇద్దరి విషయంలో పార్టీ పెద్దలు కల్పించుకుని ఇద్దరిని బుజ్జగిస్తే నేతలు సైలెంట్ అవుతారా.. లేదంటే పాత కక్షలు బయటకు తీసి మరోసారి నువ్వానేనా అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది చూడాల్సి ఉంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Khammam Congress War: ఖమ్మం కాంగ్రెస్‌లో వార్.. ఎమ్మెల్యే వర్సెస్ చైర్మన్