Etela Rajender:ఒకే దెబ్బకు అటు కేసీఆర్.. ఇటు రేవంత్ రెడ్డి! ఈటలతో మోడీ-షా జబర్దస్త్ ప్లాన్?

Etela Rajender:ఈటల రాజేందర్ ను గజ్వేల్ లో పోటీ చేయించడం వెనుక బీజేపీకి పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా... ఒకేసారి అటు కేసీఆర్ ను ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా మోడీ-షా ద్వయం స్కెచ్ వేసిందని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Jul 10, 2022, 09:55 AM IST
  • పక్కా ప్లాన్ తోనే గజ్వేల్ లో ఈటల పోటీ
  • కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా బీజేపీ ప్లాన్
  • రేసులో కాంగ్రెస్ ను మూడో స్థానమే?
Etela Rajender:ఒకే దెబ్బకు అటు కేసీఆర్.. ఇటు రేవంత్ రెడ్డి! ఈటలతో  మోడీ-షా జబర్దస్త్ ప్లాన్?

Etela Rajender:హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించి కాక రేపారు బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. బెంగాల్ నందిగ్రామ్ లో మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారని.. గజ్వేల్ లోనూ కేసీఆర్ ను ఓడించి తీరుతానని ప్రకటించారు. ఈటల రాజేందర్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈటల కొండను ఢీకొట్ట బోతున్నారని.. ఆయన అంత సాహసం ఎందుకు చేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. నిజానికి జాతీయ పార్టీల్లో అభ్యర్థుల ప్రకటన ముందస్తుగా ఉండదు. రాష్ట్ర పార్టీ చేతిలోనూ ఉండదు. పోటీ చేసే అభ్యర్థుల జాబితా హైకమాండ్ నుంచి రావాల్సిందే. కాని ఈటల రాజేందర్ మాత్రం వచ్చే ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే గజ్వేల్ లో పోటీ చేయాలన్నది ఈటల సొంత నిర్ణయం కాదని.. హైకమాండ్ డైరెక్షన్ లోనే ఆయన ఈ ప్రకటన చేశారనే టాక్ వినిపిస్తోంది.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్ఘంగా ఈటల రాజేందర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గంటపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే బెంగాల్ తరహాలోనే సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో ఈట పోటీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. 

ఈటల రాజేందర్ ను గజ్వేల్ లో పోటీ చేయించడం వెనుక బీజేపీకి పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా... ఒకేసారి అటు కేసీఆర్ ను ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా మోడీ-షా ద్వయం స్కెచ్ వేసిందని తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకత ఉందని వివిధ సర్వేల్లో తేలింది. మల్లన్నసాగర్ భూనిర్వాసితులు సీఎంపై  ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నాయకుడైన ఈటల రాజేందర్ పోటీ చేస్తే కేసీఆర్ కు గట్టి పోటీనే. నందిగ్రామ్ ఫలితం గులాబీ లీడర్లను భయపెడుతుంది. ఈటల బరిలో ఉంటే గజ్వేల్ పై కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. దీంతో రాష్ట్రంలో విస్త్రతంగా ప్రచారం చేయకుండా కేసీఆర్ ను కొంత నిలువరించవచ్చని కమలనాధుల ప్లాన్. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ కాకుండా మరో సీటు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాని ఇప్పుడు ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నందున కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేయాల్సిందే. లేదంటే ఓటమి భయంతోనే మరో నియోజకవర్గానికి వెళుతున్నారనే అస్త్రం బీజేపీకి దొరుకుతుంది. ఇది టీఆర్ఎస్ పార్టీపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో కేసీఆర్ ఖచ్చితంగా గజ్వేల్ నుంచి పోటీ చేయాల్సిందే. 

గజ్వేల్ లో ఈటల రాజేందర్ పోటీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ లాంటిదే.  సీఎం కేసీఆర్ పై రాజేందర్ పోటీతో రాష్ట్ర రాజకీయాల ఫోకస్ అంతా అటు వైపే ఉంటుంది. పోటీ టీఆర్ఎస్ , బీజేపీగా మారిపోతుంది. దీని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుంది. దీంతో రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థి బీజేపీనే అన్న కలరింగ్ వస్తుంది. ఇది కాంగ్రెస్ కు చాలా ప్రమాదం. ఇప్పటికే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా చెబుతున్నాయి. గజ్వేల్ లో ఈటల పోటీతో వార్ టీఆర్ఎస్, బీజేపీ అన్నట్లుగా మారిపోనుంది. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి వాతావరణమే కన్పించే అవకాశం ఉంటుంది. రేసులో కాంగ్రెస్ వెనకబడిపోతుంది. ఇదే జరగాలని కమలం పార్టీ కోరుకుంటుంది. కేసీఆర్ ను ఢీకొట్టేది బీజేపీనే అన్న సంకేతం జనంలోకి వెళితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కమలానికి టర్న్ అవుతుందన్నది బీజేపీ లెక్క. అందుకే పక్కా ప్లాన్ ప్రకారమే ఈటల రాజేందర్ ను గజ్వేల్ నుంచి బరిలోకి దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు తామే ప్రధాన ప్రతిపక్షమని కాంగ్రెస్ రేసులో ఉండాలంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్ లో పోటీ చేయాల్సి ఉంటుంది. మరీ ఆయన అంత సాహసం చేస్తారా అన్నది డౌటే.  

గజ్వేల్ లో ఒకవేళ ఈటల రాజేందర్ ఓడిపోయినా ఆయనకు పెద్ద నష్టం ఉండదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈటల గజ్వేల్ లో పోటీ చేస్తే హుజురాబాద్ నుంచి ఆయన సతీమణి జమునా రెడ్డి పోటీ చేస్తుంది. ఈటల గజ్వేల్ లో ఓడినా బీజేపీ హైకమాండ్ ఆయనను రాజ్యసభకు పంపించే అవకాశం ఉంటుంది. గజ్వేల్ లో కేసీఆర్ పోటీ చేస్తే ఈటల గ్రాఫ్ మరింతగా పెరిగిపోతుంది. ఇవన్ని ఆయనకు కలిసివచ్చేవే. అందుకే తనను అవమానకరంగా కేబినెట్ నుంచి తొలగించారనే కసితో ఉన్న రాజేందర్.. కేసీఆర్ తో తాడోపేడో తేల్చుకునేందుకే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీ చేస్తానన్న ఈటల రాజేందర్ ప్రకటన తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. గులాబీ పార్టీతో పాటు కాంగ్రెస్ లో గుబులు రేపుతోంది. మరోవైపు నరేంద్ర మోడీ- అమిత్ షా వ్యూహాలు ఇలానే ఉంటాయనే టాక్ వస్తోంది.  

Read also: Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!

Read also: KCR VS ETELA RAJENDER:గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ.. బెంగాల్ సీన్ రిపీటయ్యేనా?  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News