దమననీతికి.. దౌర్జన్యానికి ఆయన వ్యతిరేకంగా కలాన్ని ఝలిపించాడు. రాజకీయ సాంఘిక చైతన్య దీపికగా మారి తన కవిత్వంతో ప్రజాకవిగా విరాజిల్లాడు. "పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది" అని చాటిన కాళోజీ తెలంగాణ జీవిత చలనశీలి... ఓ వైవిధ్యమైన ఉద్యమకారుడు. ఆయన రచించిన "నా గొడవ" తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభంజనాన్నే సృష్టించింది. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన ఆయన.. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అవసరమే అని చాటారు. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు' అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..!
*1914, సెప్టెంబరు 9 తేదిన (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తల్లి మాతృభాష కన్నడ కాగా.. తండ్రి భాష మరాఠీ. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరనివాసం ఏర్పరచుకుంది.
*1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష.
*1945లో వరంగల్ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు కాళోజీకి నగర బహిష్కరణశిక్ష విధించారు.
*కాళోజీ బహుభాషా కోవిదుడు. చిన్నప్పటి నుండీ తెలుగులో చదువుకున్నా.. ఆయన మరాఠీ, కన్నడం, హిందీ, ఉర్దూ భాషల్లో కూడా కవిత్వం రాశారు.
*ఆంధ్ర సారస్వత పరిషత్" వ్యవస్థాపక సభ్యుల్లో కాళోజీ కూడా ఒకరు. స్వరాజ్య పోరాటంలో విరివిగా పాల్గొన్న కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ.
*లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ గురించి కాళోజీ రాసిన పంక్తులు ఆయన జీవితానికి కూడా వర్తిస్తాయి. అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు...అన్యాయం అంతరిస్తే.. నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అని చాటిన కవి కాళోజీ
*1940లో రుక్మిణిభాయిని వివాహమాడారు కాళోజీ. రజకార్ల ప్రతిఘటన, స్టేట కాంగ్రెస్ సత్యాగ్రహాలు, ఆంధ్రమహసభ, తెలంగాణ రైతాంగ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, పౌరహక్కుల పోరాటం.. ఇలా అన్ని పోరాటాలలో కూడా కాళోజీ పాలుపంచుకున్నారు. విప్లవమే తన జీవిత పరమావధి అని చాటారు.
*భాషలను, యాసలను కించపరిచేవారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు కాళోజీ. ఎవరి వాడుక భాషల్లో వారు రాయాలన్నదే కాళోజీ సిద్ధాంతం.
*1992లో కాళోజీకి భారత రెండవ అత్యున్నత పురస్కారమై పద్మవిభూషణ్ లభించింది.
*కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ వారు 1992లో కాళోజీకి డాక్టరేట్ ప్రదానం చేసారు.
*అణా కథలు, నా భారతదేశ చరిత్ర, పార్థివ వ్యయము, కాళోజీ కథలు, నా గొడవ, జీవన గీత, బాపు బాపు బాపు.. మొదలైనవి కాళోజీ కలం నుండి జాలువారిన అద్భుత రచనలు.
*ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక అని చాటిన కవి కాళోజీ.
*"సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 తేదిన తుదిశ్వాస విడిచారు. అతని మరణానంతరం ఆయన పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు.
*కాళోజీ జయంతినే తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం విశేషం