Tula Uma Joins in BRS: బీజేపీ సీనియర్ నాయకురాలు తుల ఉమ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం తుల ఉమతో పాటు వారి ముఖ్య అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి కెటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి.. బీఫామ్ ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరం అని అన్నారు. ఇది మహిళలకే కాకుండా బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి సీనియర్ మహిళా నాయకురాలుగా.. నాడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారని గుర్తుచేశారు.
తెలంగాణ ఆడ బిడ్డగా బీఆర్ఎస్ పార్టీ ఇంటిబిడ్డగా తన సేవలందించిన తుల ఉమక్కకు బీజేపీ ఇటువంటి అవమానం జరగడం బాధగా ఉందన్నారు కేటీఆర్. బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని.. నిరసిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు స్వయంగా తానే ఉమక్కకు ఫోన్ చేసి ఆహ్వానించానని తెలిపారు. తమ ఇంటి ఆడబిడ్డగా గులాబీ గూటికి తిరిగి చేరుకోవాలనే తన ఆహ్వానాన్ని మన్నించి రావడం సంతోషంగా ఉందన్నారు.
తుల ఉమక్కకు గతంలో ఉన్న హోదాకంటే కూడా మరింత సమున్నత హోదాను.. బాధ్యతలను అప్పగించి పార్టీ గౌరవించుకుంటుందని కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిబద్దత కలిగిన సైనికురాలిగా ఎలాంటి కల్మషం లేకుండా కలిసి పనిచేసిన తుల ఉమతో అంతే నిబద్థతో తిరిగి కలిసి పనిచేస్తామన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతికోసం అక్క సేవలు అవసరం అని అన్నారు. గతంలో కూడా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం.. మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహిళాభ్యున్నతికోసం కృషి చేసిన తుల ఉమక్కకు పుట్టిన గూటికి పున:స్వాగతం పలుకుతున్నామని కేటీఆర్ అన్నారు.
కాగా.. వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున తుల ఉమ నామినేషన్ వేయగా.. పార్టీ ఆమెకు బీఫామ్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో వికాస్ రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో మనస్థాపం చెందిన తుల ఉమ.. బీజేపీ నాయకులు మరోసారి తనకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నమ్మించి మోసం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. నేడు కేటీఆర్ ఆహ్వానం మేరకు సొంత గూటికి తిరిగి చేరుకున్నారు.
Also Read: Salman Khan: థియేటర్లోనే టపాసులు పేల్చిన ఫ్యాన్స్.. టైగర్-3 మూవీ షోలో రచ్చరచ్చ
Also Read: CM Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook