Siddipet IT towers: కలలో కూడా అనుకోలేదు : మంత్రి హరీశ్ రావు

Siddipet IT towers Inauguration: మంత్రి కేటీఆర్ గురించి మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని కొనియాడారు. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటోంది అని చెబుతూ మంత్రి కేటీఆర్ పని తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Written by - Pavan | Last Updated : Jun 16, 2023, 08:42 AM IST
Siddipet IT towers: కలలో కూడా అనుకోలేదు : మంత్రి హరీశ్ రావు

Siddipet IT towers Inauguration: కలలో కూడా సిద్దిపేటకి ఐటీ టవర్ వస్తుందని అనుకోలేదు అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా అయ్యి ఐటీ టవర్ వచ్చిందంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ వల్లే అది సాధ్యమైంది అని అన్నారు. సిద్దిపేటలో చదివిన బిడ్డలు సిద్దిపేటలోనే ఐటీ ఉద్యోగం చేసుకునే అవకాశం లభించింది. రాబోయే రోజుల్లో మంత్రి కేటీఆర్ సహకారంతో సిద్ధిపేట జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని తెలిపారు. 

ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిశ్రమలకు పవర్ హాలీడే ఇస్తున్నారు. గతంలో మన రాష్ట్రాన్ని ఎందరో ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ.. విజన్ 2020 అన్నారు. .హైటెక్ సిటీ అన్నారు. కానీ వాళ్ళ వల్ల కానిది సీఎం కేసీఆర్ చేసి చూపించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం వెనుకబడిపోతుందని చాలా చాలా అనుమానాలు సృష్టించారు. కానీ ఎవరైతే కేసీఆర్ ని తిట్టారో.. ఆ నోళ్లే ఇప్పుడు కేసీఆర్ ని మెచ్చుకుంటున్నాయి అంటూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఆకాశానికెత్తారు.  

ప్రస్తుతం యావత్ దేశమే తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ ఆచరిస్తున్న విధానాలనే దేశం మొత్తం అనుసరిస్తోంది అని అన్నారు. మరో సారి సీఎం కేసీఆర్‌ని గెలిపించి హ్యాట్రిక్ గెలుపు అందివ్వాలి అని ఈ బహిరంగ సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో, సిద్ధిపేట వాసుల్లో జోష్ ని నింపే ప్రయత్నం చేశారు. 

అదే విధంగా మంత్రి కేటీఆర్ గురించి మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని కొనియాడారు. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటోంది అని చెబుతూ మంత్రి కేటీఆర్ పని తీరు గురించి మంత్రి హరీశ్ రావు కితాబిచ్చారు. 

ఇదిలావుంటే, మరోవైపు సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సిద్ధిపేటను చూసి అసూయపడేలా మంత్రి హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నారు అంటూ తన మేన బావ, మంత్రి అయిన హరీశ్ రావుకు కితాబిచ్చారు. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర  సమీకృత సమతుల్య సమ్మిళిత అభివృద్ధి. జాతీయ స్థాయిలో మనకు ఓ వైపు పంచాయతీ అవార్డులు.. మరోవైపు పట్టణ ప్రగతి అవార్డులు వరిస్తున్నాయి. చాలా మంది సిద్దిపేట మీద ప్రత్యేక ప్రేమ ఎందుకు అని అడుగుతున్నారు. ఉద్యమ నాయకుణ్ణి అందించిన జిల్లా సిద్ధిపేట గడ్డ. సిద్దిపేటలో కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేదా.. మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. హరీష్ రావు నాకు బావ కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తుంటా.. నేను సిద్ధిపేట మీదుగా సిరిసిల్లకి వెళ్ళేటప్పుడు, సిద్దిపేటకి వచ్చినప్పుడు మా బావకి ఫోన్ చేసి మళ్ళీ కొత్తది ఏం కట్టినవ్ బావా అని అడుగుతుంటా.. సిద్దిపేటని మంత్రి హరీశ్ రావు అలా అభివృద్ధి చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

స్వచ్చబడి సిద్దిపేట స్పూర్తితో ప్రతి జిల్లాలో స్వచ్చబడి ఏర్పాటు చేస్తాం. 1980లో సిద్దిపేట అభివృద్ధి మొదలైంది. దళిత బంధు కొత్త పథకం అని అంటున్నారు... సిద్దిపేటలో ఆనాడే దళిత చైతన్య జ్యోతి అని కేసీఆర్ పెట్టారు. మిషన్ భగీరథకు పునాది పడ్డది కూడా సిద్దిపేటలోనే. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టింది. ప్రతీ నియోజకవర్గం సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తాం. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకుని మేమందరం పని చేస్తాం. ఈసారి హరీష్ రావుని లక్ష 50 వేల మెజార్టీతో గెలిపించాలి అని సిద్ధిపేట ఓటర్లను కోరారు. 

టాస్క్‌తో యువతకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇప్పిస్తాం... రాబోయే రోజుల్లో ఐటీ హబ్‌ని ఇంకా విస్తరిస్తం అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదన్న కేటీఆర్.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. 2014 లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు. ఈ 9 ఏళ్లలో ఐటీ ఎగుమతులు 2 లక్షల 41 వేల కోట్లు. ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు. మన తెలంగాణలో 6.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణలో యువత ఎక్కువగా ఉంది.. వారికి ప్రైవేట్ ఉద్యోగం సృష్టించడం కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌కి హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలి అని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.

Trending News