తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పైరసీ సినిమా ప్రదర్శనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సిబ్బంది ఇంత బాధ్యత రాహిత్యంగా ఉందా? అని మండిపడ్డారు. ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే..! అయితే ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజే గరుడ బస్సులో ప్రదర్శించడంపై సునీల్ అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.
బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారంటూ టీవీ స్క్రీన్‌షాట్‌లను కేటీఆర్‌కు పంపించాడు. ప్రభుత్వ సంస్థల్లోనే ఇలా పైరసీ ఉంటే.. ఇక పైరసీ నియంత్రించాలని సామ్యానుడిని ఎలా అడుగుతారని ప్రశ్నించాడు. సునీల్ ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్... ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎండీని కోరారు.
That’s extremely irresponsible on the part of the @TSRTCHQ staff of this bus. Request JMD of @TSRTCHQ to make sure to act and prevent recurrence https://t.co/lR2Ga8Wy70
— KTR (@KTRTRS) April 15, 2018
నాని డ్యుయల్ రోల్ చేసిన మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ డైరెక్టర్. వారం రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం వైపుగా దూసుకెళుతోందని మూవీ యూనిట్ తెలిపింది. ఇందులో నానికి జోడీగా అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ నటించారు.