హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ తెరంగేట్రంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలోనే తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో 'తెలంగాణ జనసమితి' పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవలే ఈ పార్టీని ప్రకటించిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగానే తమ పార్టీ పోటీచేస్తుందని ప్రకటించారు. ఈ ఎన్నికలకు ముందు పంచాయితీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని అయన సన్నిహితులు తెలిపారు. ఇక ఏప్రిల్ 4 అంటే ఇవాళ పార్టీ జెండా ఆవిష్కరణలో కోదండరాం మరిన్ని విషయాలను వెల్లడించే అవకాశముంది.
తెలంగాణ జనసమితి జెండా తెలుపు, నీలిరంగు, ఆకుపచ్చ రంగుల్లో ఉండబోతుందని తెలుస్తోంది. రైతులు, కార్మికులను ఆకట్టుకోవడానికే ఆ రంగుల్లో జెండా నమూనా తయారుచేసినట్టు సమాచారం. జెండా నమూనా కోసం పరకాల సలహా తీసుకుంటున్నట్టు కోదండరాం చెప్పారు. ఏప్రిల్ 29న నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు కోదండరాం ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు పార్టీ భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తారని జేఏసీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 29న జరిగే బహిరంగ సభలో చాలా మంది ప్రముఖులు, ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరతారని కోదండరాం తెలిపారు. పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇప్పటికే పోలీసుల అనుమతి కోరారు. పరేడ్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలలో.. ఏదేని ఒకదాంట్లో సభ జరుపుకోవడానికి అనుమతినివ్వాలని కోరారు.