Sardar Sarvayi Papanna: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి.. ఎవరీ పాపన్న ? చరిత్రకెక్కిన యోధుడు ఎలా అయ్యాడు ?

Sardar Sarvayi Papanna: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా చరిత్రకెక్కిన వీరుడి గురించి.. చరిత్రకారులు చెప్పని యోధుడి జీవిత విశేషాల గురించి అందిస్తున్న ప్రత్యేక కథనం.

Written by - Pavan | Last Updated : Aug 18, 2022, 09:40 AM IST
  • సర్వాయి పాపన్నలో వీరుడిని వెలికితీసిన ఘటన.
  • సినిమాను తలపించే పాపన్న వీరగాథ..
  • సంస్ధానాలు, దొరల గడీలపై మెరుపుదాడులు..
  • శత్రుదుర్బేధ్యమైన ఎత్తైన కోటకట్టడాల నిర్మాణం
  • ఆలోచనలో పడిన ఔరంగజేబు కొలనుపాక పాలకుడికి ఆదేశాలు..
  • గోల్కొండ కోటలోకి పాపన్నకు ఎర్ర తివాచీ పరచిన బహదూర్ షా..
  • ప్రాణాలతో హుస్నాబాద్‌కు.. ఎల్లమ్మ గుడి కట్టించి అక్కడే రహస్య జీవనం..
  • ఇందులో ఏది నిజం.. చరిత్ర చెప్పని పాఠం..
Sardar Sarvayi Papanna: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి.. ఎవరీ పాపన్న ? చరిత్రకెక్కిన యోధుడు ఎలా అయ్యాడు ?

Sardar Sarvayi Papanna: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా చరిత్రకెక్కిన వీరుడి గురించి.. చరిత్రకారులు చెప్పని యోధుడి జీవిత విశేషాల గురించి అందిస్తున్న ప్రత్యేక కథనం. తెల్లోడిమీద తిరుగుబాటు చేసి దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు చరిత్రలో స్థానం దక్కడం సంతోషించదగిన విషయం. కానీ తెల్లోడు మన దేశంపై కన్నేయడం కంటే ముందే సామ్రాజ్యవాద కాంక్షతో దేశాన్ని.. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన ఒక బహుజన వీరుడిగాథ గురించి ఎంతమందికి తెలుసు అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. అందుకు కారణం చరిత్రలోని కీలక ఘట్టాలను రాసిన చరిత్రకారులు ఆ యోధుడిని మాత్రం కావాలనే విస్మరించారనే వాదన ఉంది. ఆ వీరుడు ఇంకెవరో కాదు.. బహుజనులకే రాజ్యాధికారం దక్కాలని 17వ శతాబ్ధంలోనే గొంతెత్తి నినదించడమే కాదు.. పిడికిలి ఎత్తి పోరాడి గెలిచిన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్. 

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. భావితరాలకు పోరాట స్పూర్తినిచ్చే వారి జీవితాలు చరిత్ర పుటల్లో ఘన కీర్తిని సొంతం చేసుకున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే.. అదే చరిత్ర పుటల్లో ఇంకొంతమంది అమరవీరుల త్యాగాలకు సముచిత స్థానం దక్కకపోవడం. అలాంటి వారిలో ప్రథముడే సర్దార్ సర్వాయి పాపన్న అని కొంతమంది చరిత్రకారులు చెబుతుంటారు. రాచరికపు వ్యవస్థలో శిస్తు కట్టించుకుని అణిచేయడమే తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియని చీకటి రోజుల్లో అట్టడుగువర్గాల బానిస బతుకుల్లో వెలుగులు నింపేందుకు పోరాడిన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న. మొగల్ సామ్రాజ్యంలో ప్రభువుల అండదండలు చూసుకుని అరాచకాలకు పాల్పడుతున్న జమీందార్లు, జాగీర్దార్ల పెత్తనానికి ఫుల్‌స్టాప్ పెట్టిన ఘనుడాయన. ఆత్మాభిమానం కోసం, అట్టడుగువర్గాల మనుగడ కోసం తనకు తెలియకుండానే కత్తి పట్టిన సర్దార్ సర్వాయి పాపన్న ఆ తర్వాత చరిత్రనే తిరగరాశాడు. 

ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా.. ప్రస్తుతం జనగాం జిల్లాలో ఉన్న రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్​ సర్దార్ సర్వాయి పాపన్న సొంత గ్రామం. గౌడ కులంలో పుట్టిన పాపన్న చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి సర్వమ్మే అన్నీ తానై అతడిని పెంచి పెద్దచేసింది. చిన్నతనం నుండే జమీందార్లు, దొరల అరాచకాలను చూస్తూ పెరిగిన సర్వాయి పాపన్నలో సహజంగానే రాచరికపు వ్యవస్థపై వ్యతిరేకత కూడా పెరుగుతూ వచ్చింది. తల్లి కోరిక మేరకు గౌడ కుల వృత్తిని చేపట్టిన సర్వాయి పాపన్నకు.. దొరల చేతుల్లో, మొగల్ సామ్రాజ్య సైనికుల చేతిలో ఎదుర్కొన్న అవమానాలు వారిపై ఉన్న వ్యతిరేకభావాన్ని మరింత పెరిగేలా చేశాయి. 

ఈ క్రమంలోనే అట్టడుగువర్గాలకు కనీసం దరికి చేరనివ్వని అగ్రవర్ణాల పెత్తనాన్ని అడ్డుకోవాలంటే తనకు బహుజనుల మద్దతు ఎంతైనా అవసరం అని భావించిన సర్వాయి పాపన్న.. తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహేబ్‌లతో కలిసి తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అరాచకాల గురించి వివరించి వారిలో చైతన్యం రగిల్చాడు. 

సర్వాయి పాపన్నలో వీరుడిని వెలికితీసిన ఘటన..
చరిత్రకారులు చెబుతున్న వివరాల ప్రకారం.. బహుజనుల నుండి భారీ మద్దతు కూడగట్టుకున్న సర్వాయి పాపన్నకు అనుకోకుండానే ఒకరోజు ఊహించని ఘటన ఎదురైంది. గ్రామాల్లో శిస్తులు వసూలు చేసుకుని గోల్కొండ కోటకు తిరిగి వెళ్తున్న సైనికులు.. సర్వాయి పాపన్న కల్లు గీసే తాటి చెట్ల వద్ద ఆగి ఎప్పటిలాగే ఉచితంగా కల్లు సేవించారని.. ఆ క్రమంలోనే తన స్నేహితుడిపై దాడి చేయడానికి వచ్చిన సైనికుడిని అడ్డుకున్న పాపన్న.. అక్కడికక్కడే ఆ సైనికుడి మెడ నరికేశాడని.. దీంతో తనపై దాడికి వచ్చిన ఇతర సైనికులను కూడా అంతమొందించాడని చరిత్ర చెబుతోంది. ఆ సైనికులు వసూలు చేసిన శిస్తును తిరిగి అక్కడి గ్రామాల్లోని పేదలకు పంచిపెట్టడంతో మొదలైన సర్వాయి పాపన్న రాజనీతి.. హస్తినలో ఉన్న ఢిల్లీ సుల్తాను ఔరంగజేబును గడగడలాడించే వరకు, గోల్కొండ కోటపై బహుజనులకు ప్రతినిధిగా, ప్రజలు మెచ్చిన రాజుగా జండాను ఎగురవేసేందుకు అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చిందంటారు.  

సినిమాను తలపించే పాపన్న వీరగాథ..
రాచరికపు నేపథ్యం లేకుండానే.. రాజుల అండదండలు లేకుండానే.. అతి సామాన్యుడైన సర్వాయి పాపన్న.. సినీ ఫక్కీలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే తయారు చేసుకున్నాడు. అంతకంటే ముందుగా పేద ప్రజలను పందికొక్కుల్లా దోచుకుతింటున్న జమీందార్లు, దొరలు, బడాబడా భూస్వాములను తన సైన్యంతో వెళ్లి దాడి చేసి దోచుకోవడం మొదలుపెట్టాడు. అలా దోచుకున్న ధనాన్ని అవసరం ఉన్న చోట పేదలకు పంచిపెడుతూనే రాజుల తరహాలో ఆధునిక ఆయుధాలను సమకూర్చుకున్నాడు. తన వెంట ఉన్న బహుజన సైన్యానికి ఆయధాల శిక్షణ ఇచ్చాడు. రాజ కుటుంబంలో పుట్టకపోయినా.. రాజనీతిజ్ఞిని ప్రదర్శిస్తూ పేదోళ్లకు రాజయ్యాడు.. అరాచక శక్తులకు సింహస్వప్నమయ్యాడు. 

సంస్ధానాలు, దొరల గడీలపై మెరుపుదాడులు..
అరాచకశక్తులకు చరమగీతం పాడిన పాపన్న.. తాను పుట్టి పెరిగిన ఖిలాషాపురంలోనే ఒక పెద్ద శత్రుదుర్భేద్యమైన దుర్గాన్ని నిర్మించాడు. అక్కడి నుంచే తన రాజ్యపాలన ఆరంభించాడు. తన సైన్యాన్ని వెంటేసుకుని వెళ్లి చిన్న చిన్న సంస్థానాలు, దొరల గడీలపై దాడులు చేసి వాటిని ఆక్రమించుకున్నాడు. తాను ఆక్రమిస్తూ వెళ్లిన ప్రతీ చోట చక్రవర్తిలా రాజ్యాలను ఏలడం ఆరంభించాడు. శత్రు సైన్యాలను తిప్పికొట్టేలా పెద్ద పెద్ద కోటలను, దుర్గాలను నిర్మిస్తూ వెళ్లాడు. అలా కరీంనగర్, హుస్నాబాద్, ఎలగందుల రాజ్యాలను జయించిన పాపన్న.. తాటికొండలో నిర్మించిన ఎత్తైన కోట ద్వారా సైనిక కార్యకలాపాలను మరింత ముమ్మరం చేశాడు. వరంగల్, నల్గొండ, భువనగిరి, కొలనుపాక, చేర్యాల, బైరానుపల్లి, జాఫర్‌ఘడ్, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లా పాపన్నపేట వరకు ఉన్న సంస్థానాలను గెలుచుకుని తన రాజ్యంలో కలిపేసుకున్నాడు. 

శత్రుదుర్బేధ్యమైన ఎత్తైన కోటకట్టడాల నిర్మాణం
తాను ఆధీనంలోకి తెచ్చుకున్న రాజ్యాల్లో మొత్తం 20 వరకు కోటలు నిర్మించాడని, ఎత్తైన గుట్టలను రక్షణ దుర్గాలుగా మలుచుకున్నాడని... కనుచూపు మేరలో ఉండగానే శత్రువుల కదలికలను పసిగట్టేలా ఎత్తైన కోట గోడల నిర్మాణం చేశాడని, ఫిరంగులు వంటి ఆయుధాలు సమకూర్చుకున్నాడని ఆయా కోటలపై ఉన్న ఆనవాళ్లే స్పష్టంచేస్తున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. కేవలం రాజ్య విస్తరణలోనే కాదు.. రాజ్య పాలనలోనూ సర్వాయి పాపన్న రాజులకు ఏమాత్రం తీసిపోలేదు. సామాజిక న్యాయం కోసం, స్వయం సమృద్ధి కోసం ప్రజలు మెచ్చేలా సంస్కరణలు తెచ్చాడు. ఓరుగల్లు, తాటికొండ లాంటి ప్రాంతాల్లో వ్యవసాయం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చెక్ డ్యామ్‌లను నిర్మించాడని చెబుతుంటారు. 

ఆలోచనలో పడిన ఔరంగజేబు కొలనుపాక పాలకుడికి ఆదేశాలు..
సర్దార్ సర్వాయి పాపన్న ఆదీనంకి తీసుకున్న రాజ్యాల నుండి పన్నులు రాకపోవడం, రాజ్యాలు ఒక్కొక్కటిగా అతడి వశం అవుతుండటంతో అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు ఆలోచనలో పడ్డాడని... పాపన్నను బంధించి తీసుకురావాల్సిందిగా అప్పటి కొలనుపాక పాలకుడైన రుస్తుందిల్ ఖాన్‌ను ఆదేశించడంతో తన సైన్యాధినేత ఖాసింఖాన్‌ను పాపన్నపై దాడికి పంపించాడని.. ఖిలాషాపూర్​పై దాడికి వచ్చిన ఖాసింఖాన్​ను హతమార్చడంతోపాటు అతడి సైన్యాన్ని తిప్పికొట్టడని చరిత్ర చెబుతోంది. అలా కొంత కాలం గడిచాకా ఈసారి ఏకంగా రుస్తుందిల్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి పాపన్నను ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాడని చరిత్రకారులు చెబుతుంటారు.

గోల్కొండ కోటలోకి ఎర్ర తివాచీ పరచిన బహదూర్ షా..
సర్దార్ సర్వాయి పాపన్న సాధించిన విజయాలు గురించి తెలుసుకుంటుంటే.. ఇవన్నీ ఒక సామాన్యుడే చేశాడా అని ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి విజయమే గోల్కొండ కోటపై రాజుగా విజయబావుటా ఎగురవేయడం. ఔరంగజేబు చనిపోయిన తర్వాత దక్షిణ భారతంలో మొఘల్ పాలన పట్టు తప్పడంతో ఇదే అదనుగా భావించిన పాపన్న గోల్కొండ కోటపై దాడికి పథకం రచిస్తున్నాడని తెలుసుకున్న మొఘల్ రాజు బహదూర్ షా స్వయంగా పాపన్నను స్వయం పాలకునిగా ఉండాల్సిందిగా చెబుతూ సంధికి ఆహ్వానించాడట. సంధికి వచ్చిన పాపన్నకు బహదూర్ షా ఎర్ర తివాచీ పరిచి మరీ సగౌరవంగా ఆహ్వానించారని ఆంగ్ల చరిత్రకారుడు టీడబ్ల్యూ హేగ్ తన రచనల్లో ప్రస్తావించడం గమనార్హం. 

పాపన్నకు బహదూర్ షా ప్రతిపాదన..
అప్పటికే అమలులో ఉన్న సంప్రదాయ పద్దతులను అనుసరిస్తూ కొంత కప్పం చెల్లించి గోల్కొండ కోటకు రాజుగా పరిపాలన చేసుకోవచ్చని బహదూర్ షా ఒక ప్రతిపాదన చేశాడని.. అందుకు అంగీకరించిన పాపన్న.. మొఘల్ చక్రవర్తి కోరినమొత్తాన్ని కప్పంగా చెల్లించి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశాడని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే సంప్రదాయ పోకడలపైనే యుద్ధం ప్రకటించి రాజుగా మారిన పాపన్న.. తిరిగి అదే సంప్రదాయాలకు తలొగ్గి వారికి కప్పం కట్టడానికి ఎలా సిద్ధపడ్డాడనే సందేహం వ్యక్తంచేసే వాళ్లు కూడా లేకపోలేదు. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. బహుజనులను ప్రతినిధి అయిన పాపన్నను గోల్కొండ కోటకు రాజుగా చేయడం ఏంటంటూ జమీందార్లు, దేశముఖ్‌లు, జాగీర్దార్లు వెళ్లి బహదూర్ షాకు మొరపెట్టుకోవడం... వారి విజ్ఞప్తి మేరకు పాపన్నపై బహదూర్ షా యుద్ధం ప్రకటించడం వెనువెంటనే జరిగిపోయాయని చరిత్ర చెబుతోంది.

ప్రాణాలతో హుస్నాబాద్‌కు.. ఎల్లమ్మ గుడి కట్టించి అక్కడే రహస్య జీవనం..
బహదూర్ షా సైన్యంతో జరిగిన భీకర పోరులో తీవ్రంగా గాయపడిన పాపన్న.. ఒకప్పటి తన రాజ్యంలోని భాగమైన హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చాడని.. అక్కడే ఎల్లమ్మ గుడిని కట్టించాడని అంటుంటారు. స్వతహాగా కల్లు గీత కార్మికుడైన పాపన్న.. అక్కడే రహస్యంగా కల్లు గీత కార్మికుడిగా జీవనం సాగించాడని చరిత్రకారులు చెపుతుంటారు. అదే సమయంలో పాపన్న కోసం వేట సాగిస్తున్న బహదూర్ షా.. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఆయన్ను బంధించడానికి ప్రయత్నించాడని.. అయితే శత్రువు చేతిలో చావడం కంటే తానే ఊపిరి తీసుకోవడం ఉత్తమం అని భావించిన పాపన్న ఆత్మహత్య చేసుకున్నాడని ఒక కథనం ప్రచారంలో ఉంది. 

ఇందులో ఏది నిజం.. చరిత్ర చెప్పని పాఠం..
ప్రజల్లో ప్రచారంలో ఉన్న మరో కథనం ప్రకారం.. 1709లో మొఘల్ సైన్యంతో జరిగిన యుద్ధంలో చేతచిక్కిన పాపన్నను.. మొఘల్ సైన్యం శిరచ్ఛేదనం చేసి తలను బహదూర్ షాకు కానుకగా ఢిల్లీకి పంపించిందని.., బహుజనులకు హెచ్చరికగా పాపన్న మొండాన్ని గోల్కొండ కోటకు వేలాడదీశారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఇందులో ఏది నిజం అనేది మాత్రం చరిత్ర స్పష్టంచేయలేదు. 

Also Read : Bahubali Reception:100 ఎకరాలు.. 250 కోట్లు.. 3 లక్షల మంది అతిధులు! గాలిని తలదన్నేలా పొంగులేటి వేడుక..

Also Read : Alluri Seetharamaraju: అల్లూరి సీతారామరాజు జయంతి.. అల్లూరి జీవిత చరిత్రపై.. జీ తెలుగు న్యూస్‌ ప్రత్యేక కథనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News