పాస్ కానేమోనని ప్రాణం తీసుకున్న ఆ విద్యార్ధినికి మంచి మార్కులు !!

మంచి మార్కులైతే వచ్చాయి..ప్రాణం తిరిగి మళ్లీ రాదు కదా. విద్యార్ధుల్లారా ఒక్కసారి ఆలోచించండి

Last Updated : Apr 19, 2019, 02:18 PM IST
పాస్ కానేమోనని ప్రాణం తీసుకున్న ఆ విద్యార్ధినికి మంచి మార్కులు !!

క్షణికావేశం నిండు నూరేళ్ల జీవితాన్ని కోల్పోయేలా చేసింది. పరీక్షల్లో పాస్ కానేమోనని అపోహతో ఆ ఇంటర్ విద్యార్ధి తన ప్రాణం తీసుకుంది. తీరా ఫలితాలు చూస్తే ఆ విద్యార్ధినికి మంచి మార్కులు వచ్చాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటకు చెందిన నవ్యశ్రీ (18) ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇంటర్ ఫస్టియర్ లో మెరుగైన ఫలితాలు సాధించింది. ఇప్పుడు తాజాగా జరిగిన సెకండియర్  పరీక్షల్లో ఇంగ్లీష్, సంస్కృతం పరీక్షలు బాగా రాసింది. మూడో పరీక్ష మ్యాథ్స్‌ పేపర్‌-1ను మార్చి 6వ తేదీన రాసిన తర్వాత ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. 

ఇలా ఆవేదనతో ఇంటికి వచ్చిన నవ్యశ్రీ తల్లిదండ్రుల ఆకాంక్ష తీర్చలేనేమోనన్న బెంగతో కుంగిపోయింది.ఇక మిగతా పరీక్షలు రాయకుండానే ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నవ్యశ్రీ ఆత్మహత్యతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తమ బిడ్డ బంగారు భవిష్యత్తును గొప్పగా ఊహించుకున్నామని... ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని వాపోయారు.
 

గురువారం విడుదల చేసిన తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో నవ్యశ్రీ కు మంచి మార్కులు వచ్చాయి. ఆంగ్లంలో 64, సంస్కృతంలో 82, మ్యాథ్స్‌-1లో 27 మార్కు సాధించినట్టు వెల్లడి కావడంతో నవ్యశ్రీ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ఈ సందర్భంగా కూతురు మరణాన్ని గుర్తు చేసుకుంటూ ...ఆ రోజు తాము ఇంట్లో ఉండి ఉంటే తమ బిడ్డను రక్షించుకునేవాళ్లమని... తమకీ క్షోభ ఉండేది కాదని తల్లిదండ్రులు భోరుమని విలపించారు. మంచి మార్కులైతే వచ్చాయి..తిరిగి ప్రాణం రాదు కదా. మంచి మార్కులైతే వచ్చాయి..ప్రాణం తిరిగి మళ్లీ రాదు కదా. విద్యార్ధుల్లారా ఒక్కసారి ఆలోచించండి

Trending News