తెలంగాణ పంచాయితీలకు రిజర్వేషన్లు ఖరారు, సగ భాగం మహిళలకే

పంచాయితీ రిజ్వేషన్ల కేటాయింపులో మహిళలకు సుముచిత గౌరవం దక్కింది

Last Updated : Dec 26, 2018, 08:11 PM IST
తెలంగాణ పంచాయితీలకు రిజర్వేషన్లు ఖరారు, సగ భాగం మహిళలకే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తియిన నేపథ్యంలో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల నగారా మ్రోగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. ఈ క్రమంలో పంచాయితీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు  పంచాయతీరాజ్‌ శాఖ సోమవారం రాత్రి రిజర్వేషన్లను ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో పంచాయతీరాజ్‌ శాఖ కసరత్తు చేసిన అనంతరం రిజ్వేషన్లను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రక్రియ పూర్తి చేశారు.

రిజ్వేషన్ల కేటాయింపు విషయాలోనికి వస్తే ఈ సారి మహిళలకు 50 శాతం రిజ్వేషన్లు కేటాయించడం గమనార్హం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ప్రకారం యాభై శాతానికి మించకుండానే రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తి చేశారు. ఎస్సీలకు 20.46, ఎస్టీలకు 5.73 శాతం, బీసీలకు 23.81 శాతం కేటాయించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,751 పంచాయతీల్లో 1,281 షెడ్యూల్‌ ప్రాంతాలకు, 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 పంచాయతీలను వారికే కేటాయించింది. మిగిలిన 10,293 పంచాయతీల్లో రిజర్వేషన్లు ప్రకటించింది. 50 శాతం అంటే 6,378 పంచాయతీలను మహిళలకు కేటాయించారు. 

ముఖ్యాంశాలు: 
* మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు , రాష్ట్ర వ్యాప్తంగా 6,378 సీట్లు కేటాయింపు
* బీసీలకు 22.79 శాతం రిజర్వేషన్లు, 2,345 పంచాయతీలు కేటాయింపు
* ఎస్సీలకు 20.53 శాతం రిజర్వేషన్లు , 2,113 పంచాయతీలు కేటాయింపు
* ఎస్టీలకు 6.68 శాతం రిజర్వేషన్లు ,  688 పంచాయతీలు కేటాయింపు. 

ఇక ఎన్నికల నిర్వహణపై దృష్టి

పంచాయతీల రిజర్వేషన్లు ప్రకటించిన రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఈ నెల 29వ తేదీలోపు జిల్లాలు, మండలాల్లో రిజర్వేషన్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో జిల్లాకు వివిధ వర్గాల వారీగా వచ్చిన రిజర్వేషన్లను జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు మండలాలకు బదిలీ చేయనున్నారు. క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా కేటాయింపులు పూర్తయిన పిమ్మట జిల్లాల వారీగా గెజిట్‌లు రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. రిజర్వేషన్ల లాంఛనాలన్నింటిని పూర్తిచేసి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల గెజిట్‌ను అందించనుంది. ఆ వెంటనే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటనకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసే  అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఎన్నికల  షెడ్యూలు విడుదల చేసే అవకాశముంది.

Trending News