హైదరాబాద్: తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎన్నికల తర్వాత మహాకూటమి అధికారంలోకొచ్చిన అనంతరం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌కి కీలక బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు. కోదండరామ్ నేతృత్వంలో ఒక చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఉత్తమ్.. అమరుల ఆశయసాధన కృషి కోసమే ఆ కమిటీ పనిచేస్తుందని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని టీజేఎస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణలతో సమావేశమైన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహాకూటమిలో భాగస్వామ్యపక్షాల వైఖరి గురించి మాట్లాడుతూ.. కూటమిలో అందరం ఒక్కతాటిపై ఉన్నామని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఏ త్యాగస్పూర్తితోనైతే ఉద్యమంలో పాల్గొన్నారో.. అలాగే ఆ ఆశయాలను నెరవేర్చుకునేందుకు సైతం తామంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రస్తుతం టికెట్స్ రానివారిక భవిష్యత్‌లో ఏర్పడబోయే తమ ప్రభుత్వంలో మండలిలో సరైన స్థానం కల్పిస్తామని టికెట్స్ ఆశిస్తున్న ఆశావహులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.
కూటమి గెలిస్తే, కోదండరామ్‌కే ఆ బాధ్యతలు అప్పగిస్తాం : ఉత్తమ్