హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారంతో 18వ రోజుకు చేరింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు దిగారు. విధుల్లో చేరేందుకు వస్తోన్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి రావొద్దంటూ ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఓవైపు తామంతా తమ హక్కుల కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం పోరాటం చేస్తోంటే... మరోవైపు మీరు విధుల్లోకి వచ్చి మా పొట్టకొట్టొద్దంటూ ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక సిబ్బందికి విజ్ఞప్తిచేశారు. ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ కొంతమంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు తిరిగి వెనక్కి వెళ్లిపోగా... వెనక్కి వెళ్లని వారిపై ఆగ్రహావేశాలకు గురైన ఆర్టీసీ సిబ్బంది దాడికి పాల్పడిన ఘటనలూ అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. పలు చోట్ల ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనలకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిలపక్షాలు నేడు వంటావార్పుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 10.30కి జేబీఎస్ దగ్గర అఖిలపక్ష నేతల వంటావార్పు నిర్వహించనున్నారు.
తాత్కాలిక డ్రైవర్లకు ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తి